ఈ ప్రపంచంలో ఈజిప్టు మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిప్టు మమ్మీలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు! ఒక్కో మమ్మీకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఈజిప్టులోని పలు చోట్ల కొన్ని వందల సంఖ్యలో మమ్మీలను కనుగొన్నారు. తాజాగా కూడా కొన్ని మమ్మీలను తవ్వకాల్లో వెలికి తీశారు. ఆ మమ్మీలు పురావస్తు శాస్త్రవేత్తలతో పాటు సామాన్య జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. వాటి నోట్లోని నాలుకలు బంగారంతో చేయబడి ఉన్నాయి. సెంట్రల్ నైలు డెల్టాలోని కువేశ్నా నెక్రోపోలీస్ ప్రాంతంలో ఈ మమ్మీలను తవ్వి తీశారు.
సదరు ప్రాంతంలో క్వెశ్నా శ్మశాన వాటికలో ఈజిప్ట్ ఆర్కియలాజికల్ మిషిన్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీక్విటీస్ వారు తవ్వకాలు జరపగా కొన్ని సమాధులు బయటపడ్డాయి. ఒక్కో సమాధి ఒక్కో కాలానికి చెందినది వారు గుర్తించారు. వాటిలోని చాలా మమ్మీల నోట్లో బంగారు నాలుకలు ఉన్నాయి. అయితే, ఆ మమ్మీలు ఇంతకు ముందు దొరికిన వాటిలా మంచి స్థితిలో లేవు. బాగా పాడైపోయి, కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతకు ముందు కూడా బంగారు నాలుకలు ఉన్న మమ్మీలను పురావస్తు శాఖ వారు గుర్తించారు.
కానీ, ఆ బంగారు నాలుకలు ఎందుకు ఉన్నాయో అన్న దానిపై ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. 2021 ప్రారంభంలో బంగారు నాలుకతో ఉన్న ఓ పుర్రె వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2021 ముగింపు సమయంలో ఓ మహిళ, పురుషుడు, ఓ పిల్ల మమ్మీ నోట్లో బంగారు నాలుకలతో దర్శనమిచ్చాయి. అవి 2500 ఏళ్ల క్రితానివని పురావస్తు శాఖ వారు తేల్చారు. మరణం తర్వాత పునర్జన్మ ఉంటుందన్న నమ్మకంతోనే వాటి నోటిలో బంగారు నాలుకలను ఉంచే అవకాశం ఉందని ఈజిప్ట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, యాంటీక్విటీస్ వారు భావిస్తున్నారు.