మనుషులకి సుఖం ఎక్కువైపోయింది. ఏం కావాలన్నా యంత్రాల మీద ఆధారపడిపోతున్నారు. మనుషులను చంపేసి ఆ స్థానంలో యంత్రాలు వచ్చాయి. శారీరక శ్రమని తగ్గించేసి పొట్టను పెంచేసి త్వరగా పైకి పంపించేలా ఆధునిక యంత్రాలు వచ్చాయి. భవిష్యత్తులో పిల్లల్ని కనడానికి కూడా మహిళలు ఇబ్బందులు పడతారని.. పిల్లల్ని కనే యంత్రాలని తీసుకొస్తున్నారు. దీంతో ఆడ, మగ బిడ్డ ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డని కొనుక్కుంటారు. ఇదొక హ్యూమన్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనుషుల్ని తయారు చేస్తారు. అదొక హ్యూమన్ ఫార్మ్. పిల్లలు పుట్టేలా వ్యవసాయం చేస్తారు. యంత్రాల ద్వారా కోడి గుడ్లను పొదిగి.. ఎలా అయితే పిల్లల్ని తయారు చేస్తారో అలా.. ల్యాబ్స్ లో కృత్రిమ గర్భం ద్వారా పిల్లల్ని పుట్టిస్తారు. ఎక్టోలైఫ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ఎక్టోలైఫ్ కృత్రిమ గర్భం అనేది మహిళ గర్భం దాల్చకుండా యంత్రం ద్వారా ఒక బిడ్డను పొందే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో బేబీ మనుషులతో సంబంధం లేని వాతావరణంలో పెరుగుతుంది.
వీడియోలో కనబడుతున్నట్టు ట్రాన్స్పరెంట్ గ్రోత్ పాడ్స్ అనేవి అమరుస్తారు. ఎప్పటికప్పుడు బేబీని లైవ్ లో చూసుకునేలా ఏర్పాటు చేస్తారు. ఇలా కొన్ని వందల బేబీలు కృత్రిమంగా తయారవుతాయి. ఇది కేవలం ఆలోచన మాత్రమే. ప్రారంభ దశలో ఉంది. బెర్లిన్ కి చెందిన నిర్మాత, ఫిల్మ్ మేకర్ మరియు సైన్స్ కమ్యూనికేటర్ అయిన హషేమ్ అల్ ఘైలి అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్ ను రూపొందించాడు. వెంటనే ఈ ఎక్టోలైఫ్ ఫెసిలిటీని అమలుచేసే ఆలోచనలు లేవని, ఇది కేవలం సంతానోత్పత్తి పరిశోధన ప్రస్తుత స్థితిని అంచనా వేసి సృష్టించిన సైన్స్ ఫిక్షన్ లో భాగమని ఆయన అన్నారు. అయితే ఈ కృత్రిమ గర్భంతో బిడ్డకు జన్మనిచ్చే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎన్నో ఏళ్ళు పట్టదని, కొన్ని సంవత్సరాల్లోనే ఇది సాధ్యమవుతుందని, దశాబ్దాల్లో ఇది విస్తృతంగా వ్యాపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రసవం అనేది చాలా నొప్పితో కూడుకున్నదని, వికారం, అసౌకర్యం, కొన్ని సార్లు తల్లికి కూడా ప్రమాదమే అని.. ఇది చాలా బాధాకరంగా ఉంటుందని అన్నారు. అయితే ఈ నొప్పులు ఏమీ లేకుండా యంత్రాల ద్వారా పిల్లల్ని కనవచ్చునని ఆయన చెబుతున్నారు. మాకు ఈ పురిటి నొప్పులు వద్దు అనుకునే వారికి, సంతానలేమి సమస్య ఉన్నవారికి, గర్భం ఫెయిల్ అయిన వారికి, ఇతర గర్బస్ సమస్యలు ఉన్నవారికి.. ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. గర్భంతో ఉన్న మహిళలు.. ఒత్తిడి ఫీలవ్వకూడదు, సిగరెట్ తాగకూడదు, కొన్ని పనులు చేయకూడదు లాంటి రిస్ట్రిక్షన్స్ ఈ కృత్రిమ గర్భంతో ఉండవని అన్నారు.
వ్యాధుల సంక్రమణ లేని వాతావరణంలో, నిర్దిష్ట ఉష్ణోగ్రతలో పిండం ఆరోగ్యంగా పెరుగుతుందని, ఇలా యంత్రాల ద్వారా పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. పిండానికి కావాల్సిన ఆక్సిజన్, పోషకాలను కృత్రిమ బొడ్డు తాడు ద్వారా అందిస్తారు. అంతేకాకుండా పిండానికి అనుగుణంగా అవసరమైన హార్మోన్లను, యాంటీబాడీస్ ని, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని కంటిన్యూగా అందిస్తూనే ఉంటారు. బేబీ వ్యర్థ ఉత్పత్తులను తొలగించి, బయోరియాక్టర్ ద్వారా మళ్ళీ తాజా పోషకాలను అందిస్తారు. ఈ కారణంగా లోపం అనేది లేకుండా పుడతారు. ఆరోగ్యవంతమైన మెదడుని కూడా ఈ టెక్నాలజీతో బిడ్డకు వచ్చేలా చేయవచ్చునని అన్నారు. శరీరంలో భౌతికపరమైన లోపాలు, జన్యుపరమైన సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని.. నివారించుకోవచ్చు.
ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే.. ఆ యాప్ లో బేబీ ఎలా ఉంది? ఎంత బరువు ఉంది? ఎంత ఎదిగింది? అనే వివరాలు అన్నీ లైవ్ లో చూసుకోవచ్చు. పిండం ఉన్న యంత్రానికి హెచ్డీ కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది పిండం బేబీగా అయ్యే 9 నెలల వరకూ ప్రతీ మూమెంట్ ని క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి కృత్రిమ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. అయితే జంతువుల కంటే మనం వెనుకబడి ఉన్నామని ఆయన అంటారు. అవును ఒక ఆవు దూడకు జన్మనిస్తే.. ఆ దూడ 5 నిమిషాల తర్వాత దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది. మరి జంతువుల కంటే తెలివైనవాళ్లమైన మనుషులం మనకి ఎందుకు సాధ్యపడడం లేదు.
మనం పూర్తిగా ఉడకని అన్నంలా తయారై బయటకి వస్తున్నాం. మృదువైన, తేలికైన పుర్రెలతో పుడుతూ.. చాలా నెలలు జంతువుల కంటే వెనుకబడి ఉన్నామని హషేమ్ అల్ ఘైలి అన్నారు. అయితే ఈ ఎక్టోలైఫ్ కృత్రిమ గర్భం ద్వారా మనం దీన్ని సాధించవచ్చునని అన్నారు. ఈ కృత్రిమ గర్భంతో మనకి ఎలాంటి పరిమితులు లేవని.. చాలా ఎక్కువ గర్భధారణ కాలాలతో ప్రయోగాలు చేయవచ్చునని, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చునని అన్నారు. అయితే ఈ టెక్నాలజీ వల్ల మాతృత్వాన్ని కోల్పోతున్నామని, బిడ్డ యొక్క స్పర్శను మిస్ అవుతున్నామని అనుకునే తల్లుల కోసం కూడా ఒక హ్యాప్టిక్ సూట్ ఉందని అన్నారు. ఈ సూట్ ద్వారా బిడ్డ తన్నుతున్న అనుభూతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ తల్లి పొందవచ్చునని అన్నారు.
అంతేనా బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పిండం ఎలా బిడ్డగా తయారవుతుందో జరిగే ప్రక్రియని మొత్తం ఆది నుంచి మొత్తం వీఆర్ హెడ్ సెట్ ద్వారా 360 డిగ్రీ కోణంలో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో చూడవచ్చునని అన్నారు. 75 హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఈ సదుపాయం ఉంది. ఒక్కో ల్యాబ్ లో 400 గ్రోత్ ప్యాడ్ లు ఉంటాయి. ఏడాదికి 30 వేల బేబీలని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ఈ బేబీ ఫార్మ్ లో పిల్లలు పుట్టడం ఇష్టం లేని వారు స్వయంగా ఇంట్లో కూడా పుట్టించుకోవచ్చునని, దాని కోసం ప్రత్యేకంగా బ్యాటరీతో పని చేసే పాడ్ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారని అన్నారు. ఏదో యశోద సినిమాని చూసినట్టు అనిపిస్తుంది కదూ.
ఆ సినిమాలో మహిళలకు గర్భం వచ్చేలా చేసి.. పిండాలని బ్యూటీ క్రీముల తయారీ కోసం వాడతారు. ఈ టెక్నాలజీతో వీళ్ళు ఏకంగా యంత్రాల ద్వారా పిల్లలకు జన్మనిస్తారట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇది యానిమేషన్ వీడియో అయినా.. జనాభా కొరత ఉన్న ఆయా దేశాలకు.. జనాభా పెంచే దిశగా కృత్రిమ గర్భంతో పిల్లల్ని తయారుచేసి ఇవ్వడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యంగా హషేమ్ అల్ ఘైలి చెబుతున్నారు. ఇది నిజం కాకపోయినా.. ఇంకొన్నేళ్లలో నిజం అవుతుందని అంటున్నారు. ఈ వీడియోలో కృత్రిమ గర్భంతో పిల్లల్ని ఎలా సృష్టిస్తారో మొత్తం వివరించారు. ఇలా మనుషులతో సంబంధం లేకుండా యంత్రాల ద్వారా కృతిమ గర్భంతో పిల్లల్ని సృష్టించే కాన్సెప్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.
పిల్లల పేరుతో ఆడవారిని హింసించే మగాళ్లకి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలు కాదు కదా. కాబట్టి ఈ యంత్రాలను ఉపయోగించుకోవచ్చు. అయితే దీనిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. సులువుగా వచ్చింది, సులువుగానే పోతుందని అంటున్నారు. సహజంగా జరగాల్సిన పుట్టుకని కూడా ఇలా అసహజం చేస్తే.. అది అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది వ్యాపారంగా మారితే.. శృంగారం కోసం ఆడ పిల్లల్ని, తమ కింద పని చేయడం కోసం మగ పిల్లల్ని రోబోలుగా, యంత్రాలుగా మార్చి బానిసల్ని చేసుకునే విష సంస్కృతి వస్తుందని అంటున్నారు. విచ్చలవిడిగా ఎంతమందిని కావాలంటే అంతమంది పిల్లల్ని తయారు చేసుకుంటారు.
ఆయా దేశాలు తమ సైన్యాన్ని పెంచుకోవడం కోసం మగాళ్లను సృష్టించుకుంటాయి. అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అంటున్నారు. 9 నెలలు ఎదురుచూడకుండా 9 నిమిషాల్లో పిల్లలు తయారయ్యేలా యంత్రాలు కనిపెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అనే నానుడి గుర్తించుకోవాలని అంటున్నారు. మరి కృత్రిమ గర్భంతో పిల్లల్ని సృష్టించే యంత్రాలు త్వరలో వస్తాయని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? వస్తే మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? మంచి ఎవరికి జరుగుతుంది? చెడు ఎవరికి జరుగుతుంది? దీని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏమిటో కామెంట్ చేయండి.