కొంత మంది దేవుడు ప్రసన్నం చేసుకోవడానికి నాలుక కోసుకోవడాలు, భక్త కన్నప్పలా కళ్లు పొడుచుకోవడాలు చేస్తుంటారు. దేవుని భక్తిలో పూర్తిగా లీనమై.. కొంత మంది వారి కరుణ కటాక్షాల కోసం బలులు వంటివి కూడా ఇస్తుంటారు.ఓ పాస్టర్ కూడా జీసెస్‌ను కలవడం కోసం మరణించేంత వరకు ఉపవాసం ఉండాలని తన అనుచరులను బలి తీసుకున్నాడు
మన కోరికలు తీర్చాలని రోజు దేవుడ్ని మొక్కుతాం. పూజలు చేసి ఫలహారాలు నైవేధ్యంగా సమర్పిస్తాం. అయితే దేవుడిపై భక్తి ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం ఉండకూడదు. కొంత మంది దేవుడు ప్రసన్నం చేసుకోవడానికి నాలుక కోసుకోవడాలు, భక్త కన్నప్పలా కళ్లు పొడుచుకోవడాలు చేస్తుంటారు. దేవుని భక్తిలో పూర్తిగా లీనమై.. కొంత మంది వారి కరుణ కటాక్షాల కోసం బలులు వంటివి కూడా ఇస్తుంటారు. అంతిమంగా దేవుడి పేరిట అఘాయిత్యాలు తెగబడుతుంటారు. అదీ ఏమతంలోనైనా ఇలానే జరుగుతున్నాయి. ఓ పాస్టర్ కూడా జీసెస్‌ను కలవడం కోసం మరణించేంత వరకు ఉపవాసం ఉండాలని తన అనుచరులను బలి తీసుకున్నాడు.
ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. మకెంజీ అనే పాస్టర్ పొలంలో 39 మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. మరణం ప్రాప్తించే వరకు ఉపవాసం ఉండాలని పాస్టర్ తన అనుచరులను కోరడంతో ఇంత మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పాస్టర్‌ను ఈ నెల 14న అరెస్టు చేశారు. అనంతరం ఆయన భూమిలో వెతకగా.. వీరి మృతదేహాలు కనిపించాయి. చాలా మంది దీన స్థితిలో కనిపించారు. వీరిలో మరికొంత మంది మరణించినట్లు తెలిపారు. దీంతో ఆ సంఖ్య 47కు చేరిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇంకా అక్కడి సమాధులు తవ్వాల్సి ఉందని చెప్పారు. ఫాదర్‌పై అనుమానం వచ్చి ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. మలిండిలోని పాస్టర్ చర్చి, స్థలాలపై దాడి చేసిన పోలీసులు విస్తుపోయారు.
చర్చిలో 15 మంది అనుచరులను కృశించి పోయిన స్థితిలో ఉన్నారు. జీసెస్ ప్రసన్నం కోసం పాస్టర్ సూచనల మేరకు తాము ఉపవాసం ఉంటున్నామని అనుచరులు చెప్పడం గమనార్హం. ఇందులో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ కేసు నిమిత్తం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనుచరుల మరణాలపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఆయనను కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ క్రమంలో శుక్రవారం పాస్టర్ భూమిలో తవ్వగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీసు కస్టడీలో ఉన్న మాకెంజీ గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటం విడ్డూరం. అయితే ఆయన గతంలో కూడా చిన్నారుల మరణాలకు సంబంధించి 2019లో, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు అరెస్టు అయ్యారు. ప్రతిసారీ, అతను బాండ్‌పై విడుదలయ్యాడు. ఈసారి అతన్ని విడుదల చేయవద్దని స్థానిక రాజకీయ నాయకులు కోర్టును కోరారు.