అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయలు లేదా భారత సంతతికి చెందిన పలువురు ఇటీవల మృత్యువాత పడ్డారు.ఇప్పుడు మరో యువతి బలైంది. అయితే ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫీసుకు బయలు దేరిన యువతి పక్క రాష్ట్రంలో శవమై కనిపించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయలు లేదా భారత సంతతికి చెందిన పలువురు ఇటీవల మృత్యువాత పడ్డారు. కొంత మంది కాల్పుల్లో మరణిస్తుంటే.. మరికొంత మంది ప్రమాదాల బారినపడి చనిపోతున్నారు. ఇప్పుడు మరో యువతి బలైంది. అయితే ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫీసుకని ఇంటి నుండి బయలు దేరిన యువతి పక్క రాష్ట్రంలో శవమై కనిపించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. విధులకు వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంపై కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.
అమెరికాలో ఈ నెల 12న అదృశ్యమైన భారత సంతతి మహిళ లహరి పతివాడ (25) అనుమానాస్పద రీతిలో శవమై తేలింది. టెక్సాస్ కొలిన్స్ కౌంటీ మెక్ కిన్నీ శివారులో నివాసముంటున్న లహరి.. ఓవర్‌ల్యాండ్ పార్క్ రీజినల్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగానికని కారులో బయలు దేరింది. అయితే విధులు ముగించుకుని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓక్లహోమాలో ట్రాక్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓక్లహొమాలో వెతకగా.. ఆమె మృతదేహం లభించింది.
డల్లాస్ శివారులోని ఎల్ డోరాడో పార్క్ వే, హార్డిన్ బౌలేవార్డ్ ప్రాంతంలో తన బ్లాక్ టయోటాను నడుపుతూ కనిపించారు. కాగా, ఆమె అదృశ్యమైన వార్త స్థానికంగా పెను సంచలనమైంది. లహరి ఫేస్ బుక్ పేజీ ఆధారంగా చూస్తే.. ఆమె టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు. బ్లా వ్యాలీ వెస్ట్ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఓవర్‌లాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో లహరి పనిచేస్తున్నారు. అయితే లహరి మృతికి కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.