ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. నేరుగా నిందితుడు ఉన్న చోటుకు వారిని తీసుకెళ్లాయి. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆవులను పొగుడ్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
హత్య కేసులో చిలుక సాక్ష్యం చెప్పిన సంఘటన గురించి మీరు వినే ఉంటారు. కొన్నేళ్ల క్రితం యజమాని హత్యకు సంబంధించి ఓ చిలుకను కోర్టులో ప్రవేశ పెట్టారు. మాటలు వచ్చిన ఆ చిలుక యజమానిని ఎవరు చంపారో చెప్పింది. దీంతో కోర్టు నేరస్తుడ్ని కనిపెట్టేసింది. ఆ చిలుకకు మాటలు వచ్చు కాబట్టి.. అది ఓ మనిషిలా సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఆవులు ఓ నేరస్తుడ్ని పట్టించాయి. సదరు నేరస్తుడు ఉన్న చోటును తెలుసుకునేలా పోలీసులకు సాయం చేశాయి. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని, నార్త్ కరోలినాకు చెందిన జోషువా రసెల్ మిల్‌టన్ అనే వ్యక్తి హైవేపై వెళుతూ ఉన్నాడు. ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. అతడు వాటిని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఇది గుర్తించిన పోలీసులు అతడి వెంటపడ్డారు. హైవేపై పోలీసుల వాహనానికి, అతడి వాహనానికి ఛేజింగ్ జరిగింది. జోషువా ఓ చోట రోడ్డు పక్క తన కారును ఆపి పొలాల్లోకి వెళ్లిపోయాడు. పొలాల్లో దాక్కుని ఉండిపోయాడు. పోలీసులు అతడి వాహనం ఆగిన చోటులో పొలాల్లో గాలించటం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే పొలంలో గడ్డి మేస్తున్న ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. జోషువా దాక్కున్న స్థలానికి పోలీసులను తీసుకెళ్లాయి. పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొచ్చారు. తమకు సహాయం చేసిన ఆవుల ఫొటోలు తీసి, తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ మొత్తం సంఘటన గురించి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.