హిందూ ధర్మం ప్రకారం గోమాత దేవతతో సమానం. ఇక అనాది కాలం నుండి గోవులు మన జీవిన విధానంలో భాగం అవుతూ వచ్చాయి. ఆవుకి పూజ చేయడం, ఆవుకి దగ్గర ఉండి ఆహరం పెట్టడం, గోశాలలు నడిపించడం, ఆవులను రక్షించుకోవడం.. ఇవన్నీ కూడా మనం ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పనులే. కానీ.., విదేశాల్లో మాత్రం ఆవు మాంసాన్ని తినేవారు ఎక్కువ. మన దేశంలో కూడా ఇలాంటి వారు ఉన్నా వారి సంఖ్య తక్కువ. అయితే.., ఇప్పుడు విదేశాల్లో కూడా ఆవుని ఒక అద్భుత శక్తిగా చూస్తున్నారా? గోవు మహత్యం విదేశీయులకి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విదేశీయులకు ఎవరినైనా కలసినప్పుడు హత్తుకుని పలకరించుకోవడం అలవాటు. కానీ.., కరోనా కారణంగా సంవత్సరం నుండి వారికి ఈ వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో.., విదేశీయులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఒత్తిడి నుండి బయట పడటానికి గోవులని హగ్ చేసుకోవడం ఉత్తమైన మార్గంగా వారికి తోస్తోంది. దీంతో.., నెదర్లాండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో గోవులను హత్తుకోవడమనే కాన్సెప్ట్కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది.
ఒక్క నెదర్లాండ్ లో మాత్రమే కాదు.., యూస్, యూకే, డచ్, ప్రాన్స్ వంటి దేశాల్లో ఇలా గోవులను హగ్ చేసుకుంటూ ప్రజలు ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. అయితే.., గోవులను హత్తుకుంటే ప్రశాంతత ఎలా కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యే దానికి అవకాశం లేకపోలేదు. దీనికి కూడా శాస్త్రీయతతో కూడిన ఓ విషయాన్ని బయట పెట్టారు నిపుణులు. గోవును హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందట. అది ఓ థెరపీలా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో.., విదేశాల్లోని గోశాలల యజమానులకు కాసుల వర్షం కురుస్తోంది. ప్రశాంతంగా గోశాలకు వచ్చి, గోవుల్ని హత్తుకొని… మనసు కుదుటపరుచుకుని వెళ్లండి అని గోశాలల యజమానులు చెబుతున్నారు. దీనికి వారు కొంత ధర కూడా నిర్ణయిస్తున్నారు. ఇలా గోవుల్ని హత్తుకోవడం వల్ల ఈ ఏడాది కాలంగా ఏర్పడ్డ ఒంటరితనం, దిగులు లాంటివి తగ్గుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుండటం విశేషం. అయితే.., గోవుల్ని హత్తుకోవడం వల్ల మనసుకు ప్రశాంతతతో పాటు, రక్తపోటు, వెన్నునొప్పి, గుండె జబ్బులు, ఒత్తిడి, కుంగుబాటు లాంటివి చాలా వరకు తగ్గుతాయని గుర్గ్రామ్లోని ఓ ఎన్జీవో చెబుతోంది. కానీ.., ఈ విషయం ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఏదేమైనా మనం దేవతగా పూజించే గోమాత విలువ విదేశీయులకి ఇప్పటికైనా అర్ధం కావడం మంచి విషయం అనే చెప్పుకోవాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.