ప్రకృతి విపత్తుల కారణంగా నిత్యం ఎంతో మంది మరణిస్తున్నారు. ఒక్కొక్కసారి ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని ఆపడం ఎవరి తరం కాదు. తాజాగా కొలంబియాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొలంబియాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున కురిసిన భారీ వర్షాలు అక్కడ బీభత్సం సృష్టించాయి.
కొలంబియాలో ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. 35 మంది గాయపడ్డారు. పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి భారీగా వరదనీరు చేరడం, కొండచరియాలు విరిగిపడటంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా తెల్లవారు జామున కురిసిన వర్షాలకు రిసరాల్డా ప్రావిన్స్ లోని ఓ ప్రాంతంలో ఉన్న అనేక గృహాలుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా మరికొంత మంది గాయపడ్డారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రాంతం ఇంకా ప్రమాదం అంచునే ఉందని.. మళ్ళీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అందుకని అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని పెరీరా నగర మేయర్ కార్లోస్ మాయా సూచించారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.