ఆమె ఓ పేరు పొందిన పాపులర్ ఫుడ్ బ్లాగర్. ఫుడ్ బ్లాగింగ్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడీయాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రకరకాల ప్రాంతాల్లో ఉండే రుచులను టేస్ట్ చేసి, అందుకు సంబంధించిన బ్లాగింగ్ వీడియోలను తన ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేది. ఈ క్రమంలో ఆ లేడీ బ్లాగర్ చేసిన ఓ తప్పు ఆమెకు ఏకంగా రూ. 15 లక్షల జరిమానా విధించేలా చేసింది. రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ తిని ఆ వీడియోను షేర్ చేసినందుకు 15 లక్షల ఫైన్ ఎందుకు వేశారు అన్న అనుమానం మీకు కలగొచ్చు. అందుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ పేరు జిన్ మౌమౌ. ఆమెకు ‘తిజి’ పేరుతో ఓ బ్లాగింగ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి ఫుడ్ ను టేస్ట్ చేసి, ఆ ఫుడ్ కు సంబంధించిన వివరాలను తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటుంది మౌమౌ. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్ లో ఆమె గ్రేట్ వైట్ షార్క్ ను కొని, వండుకుని తిన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అయితే వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ లా ప్రకారం వైట్ షార్క్ ను కొనడం, తినడం నేరం. అదీకాక వైట్ షార్క్ ను అక్రమంగా కలిగి ఉంటే చైనాలో దాదాపు కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. ఇక మౌమౌ సదరు గ్రేట్ వైట్ షార్క్ ను కొనుక్కుని, వండుకుని తిన్న వీడియోను జూలైలో చైనాలోని టిక్ టాక్ యాప్ లో షేర్ చేసింది.
ఆ వీడియోలో మౌమౌ ఆ షార్క్ తో పడుకుని పోజిస్తు కనపడింది. అంతటితో ఆగక.. ఆ షార్క్ ను వండుకుని తిన్నది. చైనా చట్టం ప్రకారం అంతరించిపోతున్న జాతులను చంపడం, తినడం నేరం. కావున సదరు బ్లాగర్ కు అక్కడి ప్రభుత్వం రూ. 15 లక్షలు జరిమానా విధించింది. ఇక ఆమె ఆ షార్క్ ను దాదాపు 7,700 యెన్ లు (సుమారు రూ. 93, 295) పెట్టి ఆలీబాబాకు చెందిన టావోబాబో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసింది. అయితే 2020లో చైనాలో ఈ షార్క్ లను కొనుగోలు చేయడం, అమ్మడం, తినడాన్ని నిషేధించింది. అదీకాక వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గ్రేట్ వైట్ షార్క్ ను అంతరించిపోతున్న జాతీగా ప్రకటించింది. ఇక డీఎన్ఏ పరీక్ష ద్వారా ఆ చేపను షార్క్ అని గుర్తించి సదరు బ్లాగర్ కు ఫైన్ విధించారు. మరి చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.