వందల రూపాయల్లో వచ్చే పింగాణీ గిన్నె, జగ్గు.. రూ.వందల కోట్లకు అమ్ముడుపోయాయి. వేలంలో అనూహ్య ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఒక చిన్న సైజు పింగాణీ పాత్ర, జగ్గు ధర ఎంత ఉంటుంది? సాధారణంగా మార్కెట్లో రూ.వందల్లోనే ఉంటుంది. మంచి నాణ్యతతో చేసినవి, బ్రాండెడ్‌వి అయితే రూ.వేలల్లో ఉంటాయేమో. కానీ ఓ పింగాణీ గిన్నె ఏకంగా రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లకు అమ్ముడైంది. వినకడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పురాతన వస్తువులు, కళాఖండాల వేలంపాటలో ఈ పింగాణీ గిన్నె, జగ్గు వందల కోట్ల ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సోథిబే అనే సంస్థ ఆసియాలో తమ ఆఫీసు మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఒక ప్రత్యేక వేలం నిర్వహించింది. ఈ ఆక్షన్‌లో చైనాకు చెందిన అరుదైన కళాకృతులను వేలం వేశారు.
ఈ వేలంలో 18వ శతాబ్దానికి చెందిన 4.5 అంగుళాల ఒక పింగాణీ గిన్నె ఏకంగా 198.2 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ.205 కోట్లు) పలికింది. సుమారుగా 300 ఏళ్ల కిందట ఈ గిన్నెను 1722-35 మధ్య యోంగ్‌జింగ్ రాజు హయాంలో అరుదైన పింగాణీతో తయారు చేశారని సోథిబే సంస్థ తెలిపింది. దీని మీద ఎనామిల్‌తో రెండు పక్షులు, వికసిస్తున్న ఒక ఆప్రికాట్ చెట్టును చిత్రీకరించారు. ఈ పాత్రను ఎవరు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం సోథిబే కంపెనీ వెల్లడించలేదు. ఇక, ఈ వేలంపాటలో మింగ్ రాజవంశానికి చెందిన ఒక మంచి నీళ్ల జగ్గు ఏకంగా 13.7 మిలియన్ డాలర్లు (రూ.110 కోట్లు)కు అమ్ముడైంది. ఈ ఆక్షన్‌లో వీటితో పాటు చేతి గడియారాలు, హ్యాండ్‌బ్యాగులు, వింటేజ్ వైన్లు, చారిత్రక గుర్తింపు గల పూల కుండీలనూ వేలం వేశారు.
This 4-inch bowl just sold for $25 million. https://t.co/F6OGh3xqT2
— CNN (@CNN) April 10, 2023