అమ్మమ్మ కోసం సైకిల్ పై బాలుడు 130 కి.మీ. ప్రయాణం చేశాడు. అది కూడా రాత్రి సమయంలో. ఎలాంటి భయం లేకుండా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్న దృఢ సంకల్పంతో దాదాపు 24 గంటలు సైకిల్ తొక్కుతూ చేరుకున్నాడు. అయితే మధ్యలో అనుకోని ఘటనతో..
ఇంట్లో అమ్మ, నాన్న ఏమైనా అంటే పిల్లలు అలగడం అనేది చాలా సహజం. కొంతమంది పిల్లలు ఇంట్లో ఓ మూలన కూర్చుని ఏడిస్తే.. కొంతమంది మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ కాసేపైతే ఇంటికి వచ్చేస్తారు. అయితే ఒక బాలుడు మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయి 22 గంటలు దాటినా ఇంటికి వెళ్ళలేదు. అమ్మ తిట్టిందని హార్టెడ్.. ‘ఐ హార్టెడ్’ అనుకుంటూ సైకిల్ మీద అమ్మమ్మ దగ్గరకు బయలుదేరాడు. ‘నన్ను తిట్టావ్ కదా, ఉండు నీ పని అమ్మమ్మకు చెప్తా’ అని తల్లి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. అప్పటికే చీకటి పడింది. అయినా గానీ అదేమీ లెక్కచేయకుండా ధైర్యంగా సైకిల్ మీద ఒక్కడే అమ్మమ్మ దగ్గరకు బయలుదేరాడు. అమ్మ, అమ్మమ్మ ఇండ్ల మధ్య దూరం ఎంతుంటుందో తెలియదు కానీ సైకిల్ ఏసుకుని బయలుదేరాడు. మరి చివరికి బాలుడు అమ్మమ్మ దగ్గరకు చేరుకున్నాడా? అమ్మమ్మకు ఫిర్యాదు చేశాడా?
చైనాలోని మిజియాంగ్ లో 11 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. సాయంత్రం సమయంలో తల్లితో బాలుడు చిన్న లొల్లి పెట్టుకున్నాడు. తల్లి తిట్టిందని అలిగి ఆ బాలుడు అమ్మమ్మకు చెప్తా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. తన సైకిల్ తీసుకుని అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. అప్పటికే చీకటి పడిపోయింది. అయినా సరే భయపడకుండా రోడ్డుపై కనిపించే బోర్డులు చూసుకుంటూ సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్లడం సాగించాడు. అయితే అమ్మమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియలేదు. దీంతో ఓ దారి ఎంచుకుని ఆ దారి గుండా సైకిల్ తొక్కుతూ వెళ్ళాడు. తనకు తెలియకుండానే 22 గంటల కంటే ఎక్కువ సమయం సైకిల్ తొక్కుతూ 130 కి.మీ. దూరం వచ్చేసాడు.
ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ వే టన్నెల్ వద్ద స్పృహ తప్ప పడిపోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని బాలుడికి సహాయం చేశారు. అయితే సైకిల్ తొక్కుతూ 22 గంటల్లో 130 కి.మీ. ప్రయాణం చేయడం పట్ల పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా జరిగిన విషయం చెప్పుకొచ్చాడు. అమ్మ మీద అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నా అని చెప్పడంతో పోలీసులు నవ్వుకుని.. కుర్రాడిని జీపులో తీసుకుని అమ్మమ్మ ఇంటి దగ్గర దిగబెట్టారు. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బాలుడ్ని తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ బాలుడికి సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.