సామాన్యుడు తమకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే.. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతాడు. తమ ఆవేదనను జడ్జి ముందు చెప్పుకుంటారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తారు. అటువంటి ఉన్నతమైన న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారు కొందరు. సుప్రీంకోర్టు జడ్జి అవినీతికి పాల్పడ్డాడు.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఎనలేని నమ్మకం ఉంది. శాసన, కార్య నిర్వాహక శాఖలు రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటాయో లేదో సమీక్షిస్తుంటోంది న్యాయ వ్యవస్థ. ఈ రెండు అదుపు తప్పినా హెచ్చరిస్తుంది. స్వయం ప్రతిపత్తి ఉన్న ఈ వ్యవస్థలో అవినీతికి తావు ఉండకూడదు. సామాన్యుడు సైతం తమకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే.. న్యాయం చేయాలంటూ చిట్టచివరికీ చేరేది న్యాయ వ్యవస్థ వద్దకే. అటువంటి ఉన్నతమైన న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారు కొందరు. అదీ కూడా అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు జడ్జి ముడుపులు స్వీకరించి.. జైలు పాలయ్యారు.
లంచం స్వీకరించిన కేసులో చైనా సుప్రీంకోర్టు జడ్జికి 12 ఏళ్లు జైలు శిక్ష పడింది. 2003 నుండి 2020 మధ్య ముడుపులు స్వీకరించినట్లు సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో మాజీ డైరెక్టర్, సుప్రీంకోర్టు ట్రయల్ కమిటీ సభ్యుడైన జస్టిస్ మెంగ్ జియాంగ్(58) అంగీకరించాడు. దీంతో జైలు శిక్షతో పాటు రెండు మిలియన్ యువాన్ల(2.3 కోట్లు) జరిమానా విధించింది ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు . ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో.. ‘సెల్ఫ్- రెక్టిఫికేషన్’లో భాగంగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు తీర్పులు, చట్ట అమలు, సంస్థల నిర్మాణ ఒప్పందాలను పొందడం, క్యాడర్ ఎంపిక వంటి విషయాల్లో ఇతరులు సాయం చేయడానికి బదులుగా లంచాలు స్వీకరిస్తూ, జియాంగ్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని రిపోర్టు పేర్కొంది.
ఆ రిపోర్టును మంగళవారం జియాంగ్ సిటీలోని ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టుకు సమర్పించారు. బీజింగ్‌లోని స్థానిక జిల్లా కోర్టులో క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. మూడు దశాబ్దాలకు పైగా దేశ న్యాయ వ్యవస్థలో పనిచేశాడు. జస్టిస్ మెంగ్ జియాంగ్ తన హోదా, అధికారాన్ని ఉపయోగించి చట్ట వ్యతిరేక పనులు చేశారని రిపోర్టు వెల్లడించింది. 2003 నుంచి 2020 మధ్య కాలంలో 21 కోట్ల(22.7 మిలియన్ యువాన్లు)కు పైగా డబ్బును లంచంగా స్వీకరించాడని తెలిపింది. గడిచిన 17 ఏండ్లల్లో కీలక బాధ్యలు నిర్వహించిన ఆయన.. వివాదాలు పరిష్కరించడానికి లంచం తీసుకున్నారని ఆరోపించింది. లంచం తీసుకున్నట్లు ఆయన అంగీకరించడంతో దోషిగా తేల్చిన కోర్టు.. 12 ఏళ్ల జైలు శిక్ష, జరిమానాను విధించింది.