ప్రేమలో ఉన్నంత సేపు ప్రపంచాన్ని మర్చిపోయి.. అందులో మునిగి తేలుతుంటారు ఆ ప్రేమికులు. అదే బ్రేకప్ అయితే మాత్రం.. ఆ విషయాన్ని తట్టుకోలేదు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోతూ అనుచిత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ లవర్ కాస్త డిఫరెంట్..
ప్రేమించిన అమ్మాయి తన ప్రపోజల్ అంగీకరించేంత వరకు పలు పాట్లు పడతాడు అబ్బాయి. తీరా ప్రేమించాక.. ఇక అతడి ఆనందానికి హద్దు ఉండదు. ఈ జంట ప్రేమ పక్షులుగా మారిపోతారు. షికార్లు, సినిమాలు, పార్కులు, చిట్ చాట్లకు కొదవ ఉండదు. అంత వరకు ఓకే కానీ.. ఏమన్నా తేడా కొట్టిందా..? ఇక ఆ ప్రేమ బ్రేకప్‌కు చేరుతుంది. ఇద్దరి సమ్మతితో బ్రేకప్ జరిగితే పెద్దగా బాధ ఉండకపోవచ్చును కానీ.. కేవలం ప్రియురాలు చెబితే ఆ ప్రియుడి మానసిక పరిస్థితి వర్ణనాతీతం. ప్రియురాలిని మర్చిపోలేక.. ఆమెను ఒప్పించలేక మరో దేవదాసులా మారిపోతుంటాడు. లేదంటే అఘాయిత్యాలకు పాల్పడతాడు. కానీ ఈ ప్రేమికుడు కాస్త డిఫరెంట్. బ్రేకప్ చెప్పిన యువతిని తిరిగి పొందేందుకు పెద్ద ప్రయోగంలాంటిదే చేశాడు.
ఇంతకూ ఈ ప్రేమ పిపాసిదీ ఏ దేశమంటే.. చైనా. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం ప్రకారం.. బ్రేకప్ చెప్పిన తన ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రేమికుడు ఏకంగా 21 గంటల పాటు వర్షంలో తడిశాడు. తమ ప్రేమను తిరిగి అంగీకరించాలని మోకాళ్లపై వేడుకున్నాడు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రేయసి బ్రేకప్ చెప్పడంతో జీర్ణించుకోలేకపోయాడు ప్రేమికుడు. గత నెల 28న దౌజాలోని తన ప్రేయసి ఇంటి వద్దకు పూల బొకేతో వెళ్లిన అతగాడు.. తన ప్రేమను తిరిగి అంగీకరించాలని కోరాడు. ఇంటి బయటే మోకాళ్లపై మోకరిల్లి ప్రార్థించాడు. ఆ రోజు మధ్యాహ్నం నుండి మరుసటి రోజు పది గంటల వరకు వర్షం వస్తున్నా కదలకుండా అక్కడే ఉండిపోయాడు.
సుమారు 21 గంటల పాటు వర్షంలో నానుతూ.. చలికి వణుకుతూ.. తన మాజీ ప్రేయసి మనసు కరిగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె హృదయం కరగలేదు. అతడి ప్రేమను చూసి చలించిపోయారు చుట్టూ ప్రక్కలవారు. అసలు ఏమైందని అతడిని ఆరా తీయగా..కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, తనను క్షమించాలని కోరుతున్నానని చెప్పాడు. ఈ విషయం తెలిసిన అక్కడి వారు.. ఆమె రావడం లేదని ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. అయినా వినిపించుకోలేదు ఆ ప్రేమికుడు. పోలీసులు వచ్చి చెప్పి చూసినా ససేమీరా అన్నాడు. మోకరిల్లడం చట్ట విరుద్ధమా.. అంటూ తనను ఒంటరిగా వదిలేయాలని కోరాడు. ఎంతకు అతడి ప్రేయసి రాకపోవడంతో చలికి తట్టుకోలేక ఇక వెనుదిరిగాడు. ఈ ప్రేమ వ్యవహారం వెంటనే నెటింట్లో వైరల్‌గా మారింది. ఆమెకు దూరంగా ఉండాలని సోషల్ సైనికులు కోరుతున్నారు.