చైనావాళ్ల తెలివితేటలు, వాడకం అందరికీ విదితమే. ఇప్పటివరకూ భూమి, ఆకాశాన్ని తనివి తీరా వాడేసిన ఈ డ్రాగన్ కంట్రీ, ఇప్పుడు నదీ జలాలను సైతం వదిలి పెట్టడం లేదు. నదితో ఏం చేస్తుందిలే అనుకోకండి..! భూమిపై ఎలా అయితే హైవేలు నిర్మించగలరో, అలా నీటిలోనూ కిలోమీటర్ల మేర హైవేని సృష్టించి, వాహనాలను పరుగులు పెట్టిస్తోంది.
అటు ఇటు రెండు నగరాలు.. మధ్యలో నది. దీన్ని దాటాలంటే రెండు ప్రాంతాలను కలిపేలా ఒక వంతెన నిర్మించాలని మనం ఆలోచిస్తాం.. ఆచరణలో పెట్టేస్తాం.. కానీ డ్రాగన్ కంట్రీ ఆలోచనలు అందుకు విభిన్నం. రెండు ప్రాంతాలను కలిపేలా వంతెన నిర్మిస్తే.. కిక్కేముంటదనుకున్న చైనా ఇంజినీర్లు, నది మధ్యలోనే వంతెనలు కడుతూ అద్భుతమైన హైవేని సృష్టించారు. ఈ కట్టడం చూసి ప్రపంచదేశాలు సైతం నివ్వెరపోతున్నాయి.
జింగ్‌షాన్ కౌంటీలోని గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం నది పొడవునా 4.4 కిలోమీటర్ల దూరం వంతెనలతో హైవే నిర్మించింది. 2015 నుంచి ఈ హైవేపై రాకపోకలు సాగుతున్నాయి. ఈ రివర్ హైవే కూడా ఒక పర్యాటక ప్రాంతంగా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎనిమిదేళ్లలో ఎంతో మంది పర్యాటకులు దీనిని సందర్శించడానికి వెళ్లారట. ఇదివరకే ఈ రివర్ హైవేకు సమాంతరంగా రోడ్డు ఉన్నప్పటికీ.. దానిని అలానే ఉంచి నది మధ్యలో కొత్తగా హైవే వేశారు.
మునుపటి రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలా చోట్ల టన్నెళ్లు తవ్వాలి. కొండలు బద్దలుగొట్టాలి. నివాసాలను ఖాళీ చేయించాలి. వేల సంఖ్యలో చెట్లను తొలగించాలి. వీటితో పోలిస్తే వంతెన నిర్మించడం సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు అంగీకారం తెలిపింది. ఇంకేముంది.. కేవలం రూ.585 కోట్ల వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేశారు. హుబీ ప్రావిన్స్‌లోని జియాంగ్జీ నది వెంబడి వంపులు తిరుగుతూ ఈ హైవే ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల సమయం కూడా కలిసొచ్చింది. గతంలో ఈ మార్గం వెంబడి ప్రయాణానికి గంట సమయం పడితే అది 20 నిమిషాలకు తగ్గింది. అంతేకాదు.. నది మధ్యలో వెళ్తూ.. దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను చూస్తుంటే ఆ అనుభూతే వేరని చెప్తున్నారు.. పర్యాటకులు. ఈ హైవేని మీరూ తిలకించి.. ఎలా ఉందో..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.