ఎటుచూసినా కన్నీళ్లు.. కాపాడండి.. కాపాడండి.. అంటూ ఆర్తనాధాలు.. హహాకారాలు, శిథిలాల కింద కుప్పలు కుప్పలు గా మృతదేహాలు. ప్రస్తుతం టర్కీ, సిరియాలో కళ్లెదుటే కనిపిస్తున్న విషాద వాతావరణం. రాకాసి భూకంపం టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసింది. ఓవైపు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లలు.. వారిని చూసి తల్లడిల్లిపోతున్న కన్నపేగులు. ఇలా భూకంపంతో ఎక్కడ చూసినా హృదయవిదారకమైన సంఘటనలే మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలు అన్ని పక్కన పెడితే.. ప్రపంచమే కన్నీరు పెట్టుకునే ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శిథిలాల కింద కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ.. ఉన్న ఇద్దరు చిన్నారులు మమ్మల్ని కాపాడండి అని దీనింగా అర్దిస్తుంటే.. కన్నీళ్లు రాక మానవు.
టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారు జామున సంబవించిన భారీ భూకంపం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పలు దఫాల్లో ఈ దేశాలను భూకంపం అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపాల దాటికి వేలల్లో మృతుల సంఖ్య నమోదు అవ్వగా.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారం కన్నీరు తెప్పిస్తోంది. ఈ విషాదంలో హృదయం ద్రవించుకుపోయే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు కాపాడండి.. కాపాడండి.. అని దీనంగా అడుగుతున్న ఆర్తనాధాలు.. చూసే ప్రతీ ఒక్కరికి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. అమ్మా, నాన్న కాపాడండి.. నొప్పిగా ఉంది.. కాపాడండి అంటున్న ఆ పిల్లల మాటలకే గుండె బరువెక్కుతోంది. టన్నుల కొద్ది బరువును పైన పెట్టుకుని మమ్మల్ని ఎవరైనా కాపాడలేరా అంటూ చూసే ఆ చిన్నారుల చూపులు ప్రపంచానికే కన్నీరు తెప్పిస్తున్నాయి. దాంతో ఈ వీడియో చూసిన వారంత ఆ చిన్నారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు.