సాధారణంగా చిన్నవాడైన తమ్ముడి మీద అన్నకు ప్రేమ ఉంటుంది. తమ్ముడికి ఏదైనా ఇబ్బంది వస్తే అన్న సహాయం చేయటానికి వెనుకాడడు. కానీ, ఈ అరుదైన సంఘటనలో అన్న ప్రాణాలు కాపాడటానికి తమ్ముడు పూనుకున్నాడు. ఓ పెద్ద సాహసమే చేశాడు.
బంధం ఏదైనా కావచ్చు… దాని విలువ కేవలం మనం కష్టాల్లో ఉన్నపుడు మాత్రమే తెలుస్తుంది. మనం ఇబ్బందుల్లో ఉన్నపుడు మాట సాయం లేదా మనీ సాయం చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. రక్త సంబంధంలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే మనం ఇబ్బందుల్లో ఉన్నపుడు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. అదే ఓ పెద్ద సాయం అయితే.. శరీరాన్ని ఇబ్బంది పెట్టేది అయితే.. మరింత ఆలోచిస్తారు. కానీ, నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు రక్త సంబంధీకుల కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టేవారు ఉంటారు. తమ శరీరంలోని అవయవాలను ఇచ్చి మరీ నా అనుకున్న వారిని బతికించుకుంటారు.
తమ రక్త సంబంధీకుల కోసం కిడ్నీ, కాలేయం వంటి అవయవాలను దానం ఇచ్చిన వారు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. తాజాగా, ఓ బాలుడు తన అన్న కోసం అరుదైన సాహసం చేశాడు. తన బోన్ మ్యారోను అన్నకు దానం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రీస్టన్ అనే 8 ఏళ్ల బాలుడి అన్నయ్య గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. క్యాన్సర్ స్టేజీలు మారుతున్న సమయంలో డాక్టర్లు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే మంచిదని, లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందని అన్నారు. దీంతో అతడికి ప్రీస్టన్ బోన్ మ్యారో ఇస్తే సరిపోతుందని తేల్చారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ప్రీస్టన్‌కు చెప్పారు. ఆపరేషన్ అని తెలిసినా కూడా ఆ బాలుడు భయపడలేదు. అన్న ప్రాణాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని అన్నాడు.
డాక్టర్లు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌కు ముందు అన్నదమ్మలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. దీన్నంతా అతడి కుటుంబసభ్యులు వీడియో తీశారు. ఇక, ప్రీస్టన్ బోన్ మ్యారోను డాక్టర్లు అతడి అన్నయ్యకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. తాజాగా, ఈ వీడియోను కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అన్నపై ఆ బాలుడికి ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.