ఉక్రెయిన్ విమాన కూల్చివేత ఘటనలో కెనడాలోని ఓ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కెనడాకు చెందిన ఆరుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఇరాన్.. మృతుల కుటుంబాలకు 10.7 కోట్ల డాలర్ల(దాదాపు రూ.800 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కెనడాలోని ఆంటారియో సుపీరియో కోర్టు ఆదేశించింది. ఇరాన్ నుండి డబ్బు ఎలా వసూలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మృతుల బంధువుల తరపు న్యాయవాది మార్క్ ఆర్నాల్డ్, కెనడా మరియు విదేశాల్లోని ఇరాన్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని, ఇందులో చమురు ట్యాంకర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఆ ప్రమాద వివరాల్లోకి వెళ్తే..
2020 జనవరిలో బాగ్దాద్ లో ఇరాన్ సేనల నాయకుడు కాసిం సులేమానీని డ్రోన్ దాడితో అమెరికా హతమార్చింది. దానికి ప్రతీకారంగా ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడి చేసే క్రమంలో ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులు ఆకాశంలోని ఉక్రెయిన్ కు సంబంధించిన పౌర విమానాన్ని కూల్చేశాయి. ఈ ప్రమాదంలో ఆ విమానంలోని 176 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. వీరిలో 55 మంది కెనడా పౌరులు కాగా.. మరో 35 మంది కెనడాలో స్థిర నివాసం ఉంటున్నవారు. ఇక ఈ విమానాన్ని పొరపాటున అమెరికా విమానంగా భావించి కూల్చేశారు. విమానాన్ని కూల్చిన కొన్ని రోజులకు ఇరాన్ సైన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పింది. మరి.. ఆరుగురు వ్యక్తుల మృతికి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.