యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది.
టీవీల్లో జంక్ ఫుడ్‌కు సంబంధించి వస్తున్న వాణిజ్య ప్రకటనలను నియంత్రించింది. ఆహార పదార్థాల్లో ఉండే కెలోరీల వివరాలు తెలిసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులకు ఎన్‌హెచ్ ఎస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఆరోగ్య కరమైన మధ్యాహ్న భోజనంలో అందించేలా చర్యలు తీసుకుంటోంది. జంక్ ఫుడ్‌లపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన కూడా చేసింది.
ప్రధాని బోరిస్ జాన్సన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రణాళికలను ప్రోత్సహిస్తోంది. టీవీల్లో బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన ప్రకటనలను ఇస్తోంది.ఈ ప్రోత్సాహకాలకు అర్హులను ఎంపిక చేసి, అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ యాప్ తో సూపర్ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్ల వివరాలను విశ్లేషించనున్నారు.
విద్యాసంస్థలు, ఆఫీసులకు కాలినడక వెళితే అదనంగా మరిన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్‌బ్యాక్ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్ ఫ్రీ టికెట్స్ పొందొచ్చు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కార్యక్రమం అమలుకు, యాప్ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దుబాయ్ కూడా ఊబకాయం, అధిక బరువు సమస్య పరిష్కారం కోసం ఇటువంటి వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.