ఒక పిల్లాడు సాహసం చేసి 60 మంది ప్రాణాలను కాపాడాడు. దీంతో అందరూ అతడ్ని ప్రశంసిస్తున్నారు. పిల్లలు అందరూ అతడిలా ఉండాలని అంటున్నారు. అసలేం జరిగిందంటే..!
ప్రమాదాలు ఊహించని విధంగా ఎక్కడి నుంచైనా రావొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పెద్దలు జాగ్రత్తగా ఉండటంతో పాటు తమ పిల్లల్ని కూడా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తే సరిపోదు. సంఘంలో అందరితో ఎలా మెలగాలి, ఏ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలనేది కూడా పిల్లలకు తెలిస్తే మంచిది. ప్రస్తుత సోషల్ మీడియాలో జమానాలో పిల్లల్ని బాగుపర్చడం కంటే తప్పుదోవ పట్టించేలాగే చాలా మంది పేరెంట్స్ పెంపకం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇకపోతే, రోడ్డు ప్రమాదాల్లో చాలా మటుకు ర్యాష్ డ్రైవింగ్, ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం, అతివేగం వల్ల జరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే కొన్నిసార్లు డ్రైవర్ల అనారోగ్యం, హఠాత్తుగా వచ్చే గుండె నొప్పి లాంటి కారణాల వల్ల కూడా జరుగుతున్నాయి. అలాంటి తరహాలో మరో ప్రమాదం జరిగేదే. అయితే ఏడో గ్రేడ్ చదివే ఒక పిల్లాడి వల్ల ఆ యాక్సిడెంట్ ముప్పు తప్పింది. యూఎస్‌లోని మిచిగాన్ నగరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ కళ్లు తిరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో బస్సులో ఉన్న ఒక విద్యార్థి సకాలంలో స్పందించి బ్రేక్ మీద కాలు వేశాడు. అలాగే ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. సాహసంగా బస్సును ఆపిన ఆ బాలుడ్ని అందరూ అభినందించారు. బస్సులో ఉన్న 60 మంది ప్రాణాలు కాపాడిన ఆ విద్యార్థిని దిల్లాన్ రీవ్స్గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.