ప్రపంచ మానవాళి గత కొన్నేళ్ల నుంచి కరోనాతో సహవాసం చేస్తూ ఇప్పటికీ కరోనాను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. దీనికి తోడుగా గత కొన్ని రోజుల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ అనే వైరస్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే..? గత కొన్నేళ్ల నుంచి పక్షులకు బర్డ్ ఫ్లూ పాకిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి తాజాగా మనుషులకు కూడా పాకింది.
అవును మీరు విన్నది నిజమే. బ్రిటన్ లో ఇటీవల ఓ మనిషి బర్డ్ ఫ్లూ బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెవాన్ లో నివసిస్తున్న 79 ఏళ్ల అలాన్ గోస్లింగ్ అనే వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. కాగా ఇతనికి పక్షులంటే మహా ప్రాణమని.. అందుకే తను ఉండే ఇంట్లో 160 పైగా బాతులను అతను పెంచుకుంటున్నాడట. బాతులను ఇంట్లో పెంచుకోవడం కారణంగానే ఇతనికి బర్డ్ ఫ్లూ సోకిందని వైద్య అధికారులు అనుమానిస్తున్నారు. మరో విషయం ఏంటంటే..? అతని ఇంట్లో ఉన్న అన్ని బాతులకు పరీక్షలు నిర్వహించగా 20 బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు చెప్పారు. అయితే వెంటనే వాటిని చంపినట్లు సమాచారం. ప్రస్తుతం అలాన్ గోస్లింగ్ వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి బర్డ్ ఫ్లూ బారిన పడిన వారిలో సగం మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది.