మానవహక్కుల కోసం పోరాడిన ప్రముఖ ఉద్యమకారుడు, న్యాయవాదికి భారీ జైలు శిక్ష పడింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..!
ఎన్నో అవార్డుల గురించి వింటుంటాం. ఫలానా రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి పురస్కారాలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అన్ని బహుమతుల్లో కెల్లా అత్యుత్తమమైనదిగా నోబెల్ పురస్కారాన్ని చెబుతుంటారు. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డులను ఇస్తుంటారు. శాంతి స్థాపన కోసం కృషి చేసిన వారికి అలాగే సాహిత్యంలో విశేషంగా రాణించిన వారికీ నోబెల్‌ను ఇస్తుంటారు. అయితే అలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న బెలారస్ ఉద్యమకారుడు, 2002 నోబెల్ గ్రహీతల్లో ఒకరైన న్యాయవాది, ప్రజా హక్కుల కోసం పోరాడిన అలెస్ బియాలియాట్ స్కీకి భారీ శిక్ష పడింది.
బియాలియాట్ స్కీకి శుక్రవారం నాడు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్ కోర్టు. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా శిక్షలు పడ్డాయి. వారిలో వాలియన్సిన్ స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేళ్లు, ఉలాద్జిమిర్ లాబ్కోవిక్జ్కు ఏడేళ్లు, జిమిత్రి సలాయుకు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడింది. 1980వ దశకంలో బెలారస్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో బియాలియాట్ ఒకరు. ఆయన స్థాపించిన వియస్నా మానవ హక్కుల కేంద్రం బెలారస్లో పౌర హక్కుల కోసం పోరాడుతోంది. అయితే వీళ్లు పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారని, దొంగ రవాణాకు పాల్పడుతున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేసింది.
2020లో దేశాధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకషెంకో ఎన్నికైనప్పుడు బెలారస్లో నిరసనలు మిన్నంటాయి. ఆ అల్లర్లలో ప్రభుత్వం 35 వేల మందిని అదుపులోకి తీసుకుంది. అప్పట్లో అరెస్ట్ అయిన 60 ఏళ్ల బియాలియాట్ స్కీ, ఆయన సహచరులు దాదాపుగా రెండేళ్లుగా జైలులోనే ఉన్నారు. కాగా, దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపాలని బియాలియాట్ స్కీ సర్కారుకు కోర్టులోనే కోరారు. కాగా, బియాలియాట్ స్కీ బృందానికి జైలు శిక్షలు విధించడాన్ని పాశ్చాత్య దేశాలు ఖండించాయి. ఇది ముమ్మాటికీ సరికాదంటూ తీవ్రంగా నిరసించాయి.