ఇప్పుడంటే దాగుడు మూతల ఆట ఆడటం బాగా తక్కువ అయింది కానీ.. 90 కిడ్స్ చాలా ఎక్కువగా ఈ ఆట ఆడేవారు. కొంతమంది దాక్కుంటే ఓ వ్యక్తి మిగిలిన వాళ్లను వెతికి పట్టుకోవాలి. ఇదే ఆట కాన్సెప్ట్. అయితే, ఈ ఆట ఆడే సమయంలో దొరకకుండా ఉండాలన్న గట్టి పట్టుదలతో ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటూ ఉంటారు పిల్లలు. ఇదే కొన్ని సార్లు వారికి ముప్పును కొని తెస్తుంది. చాలా మంది ప్రమాదానికి గురయ్యారు కూడా. తాజాగా, ఓ కుర్రాడు దాగుడు మూతల ఆట ఆడుతూ ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లిపోయాడు.
వారం రోజులు తిండి తిప్పలు లేకుండా అలమటించాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జనవరి 11న బంగ్లాదేశ్, చిట్టిగావ్‌కు చెందిన 15 ఏళ్ల ఫాహిమ్ అనే తోటి పిల్లలతో కలిసి దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాడు. వీరు ఆట ఆడుతూ ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. తన మిత్రుడికి దొరకకుండా ఉండటానికి ఫాహిమ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి ఓ గూడ్సు రైల్లోకి ఎక్కాడు. ఆ గూడ్సు రైలు మలేషియా వెలుతుందని అతడికి తెలీదు. లోపలికి ఎక్కి డోరు మూశాడు. కొద్దిసేపటి తర్వాత గూడ్సు సిబ్బంది అక్కడికి వచ్చి దాన్ని లాక్ చేశారు.
గూడ్సు బండి కదిలింది. దాదాపు ఆరు రోజులు ఫాహిమ్ లోపలే ఉండిపోయాడు. నీళ్లు, తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోయాడు. వారం తర్వాత మలేషియాలో డోరు ఓపెన్ చేశారు. పడిపోయేలా ఉన్న అతడ్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతడి దేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.