బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగి.. ఏకంగా 37 మంది సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఢాకా నుంచి బరుంగా బయల్దేరిన ఫెర్రీలో ఈ ప్రమాదం సంభవించింది. ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలోని జల్కోటి సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు 500 మంది ఉన్నారు. 37 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాలిన గాయాలతో ఉన్న వందమందిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగి ఆ తర్వాత మంటలు బోటు మొత్తం వ్యాపించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చాలా మంది మంటలను చూసి నీటిలోకి దూకినట్లు చెబుతున్నారు.