సాధారణంగా ఏదైనా హూటల్.. రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ సర్వీస్ నచ్చకపోయినా.. ఐటమ్స్ నచ్చకపోయినా మేనేజర్ కి ఫిర్యాదు చేస్తాం. తర్వాత వారు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తనకు సూప్ నచ్చలేదని, సర్వీస్ చేసేది ఇలాగేనా? అంటూ వేడివేడి సూప్‌ను రెస్టారెంటు మేనేజర్‌పై పోసేసి వెళ్లి పోయింది. వేడివేడి సూప్ ముఖంపై పడడంతో రెస్టారెంట్ మేనేజర్ షాక్ కు గురయింది. తర్వాత ఆ కస్టమర్ కారు నంబరును గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇటీవల రెస్టారెంటుకు వచ్చిన ఓ కస్టమర్ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేయగా, ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్‌లో ప్లాస్టిక్ ముక్కలు కనపడ్డాయి. దాంతో ఆ మహిళ ఏంటీ సూప్ అంటూ అక్కడే ఉన్న మేనేజర్ పై కోపంతో ఊగిపోయింది. మేనేజర్ ఆ మహిళకు సర్ధి చెప్పాలని ప్రయత్నం చేసే లోగా ఒక్కసారే వేడి వేడి సూప్ ముఖం పై పోసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. వేడివేడి సూప్ ముఖంపై పడడంతో రెస్టారెంట్ మేనేజర్ తల్లడిల్లిపోయింది.. వెంటనే కస్టమర్‌ను పట్టుకోవడానికి మేనేజర్ బ్రోలాండ్ ప్రయత్నించింది.
రెస్టారెంట్ ముందు ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆ కస్టమర్ కారు ఫోటోలు తీయించింది. అనంతరం ఆ ఫొటోల ఆధారంగా టెక్సాస్ పోలీసులకు మేనేజర్ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లను కూడా పోలీసులకు అందించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే సూప్ నచ్చకపోతే ఫిర్యాదు చేయాలి కానీ.. ఇలా వేడి వేడి సూప్ ముఖంపై పోయడం మంచి పద్దతి కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.