యూట్యూబ్ అనేది చాలా మందికి అతి పెద్ద ఆదాయవనరుగా మారింది. అయితే కొందరు వ్యూస్ కోసం పిచ్చి ప్రయోగాలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
యూట్యూబ్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాక.. ఆదాయ వనరుగా కూడా మారింది. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. కోట్లలో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు. టాలెంట్ ఉండి అవకాశాలు లేని వారికి కోసం యూట్యూబ్ మంచి వేదికగా మారింది. భిన్నమైన కంటెంట్, టాలెంట్ ఉన్న వారికి యూట్యూబ్ కల్పతరువుగా మారింది. అయితే ఈమధ్య కాలంలో వ్యూస్ కోసం కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘనటలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. వ్యూస్ కోసం విమానాన్ని పేల్చేశాడు ఓ యూట్యూబర్. ఆ వివరాలు..
అమెరికాకు చెందిన ట్రెవర్ జాకబ్ అనే వ్యక్తి వ్యూస్ కోసం తాను ప్రయాణిస్తున్న విమానాన్నే కూల్చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ట్రెవర్ జాకబ్ ఒలింపిక్ స్నోబోర్డ్ క్రీడాకారుడు. కొన్నాళ్ల క్రితం అతడు యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. దానిలో స్కైడైవింగ్, ఏవియేషన్, స్నోబోర్డింగ్ కు సంబంధించిన వీడియోలను తీసి పోస్ట్ చేసేవాడు. ఆయన ఛానల్ కు లక్షమంది సబ్‌స్రైబర్లు కూడా ఉన్నారు.
ఇక 2021 నవంబరు 24న లోంపోక్ ఎయిర్‌పోర్టు నుంచి ఒక పాత సింగిల్ ఇంజిన్ కలిగిన లైట్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని తన స్నేహితుడి చితాభస్మాన్ని వెదజల్లడానికి వెళ్లాడు. లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ పై విమానం ఎగురుతుండగా అది ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది. దానిలో ప్రయాణిస్తున్న ట్రెవర్.. పారచూట్ సాయంతో విమానం నుంచి బయటకు దూకాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోని.. ‘నేను విమానాన్ని కూల్చేశాను’ అనే శీర్షికతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో అతడిపై అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో అతడు విమానం ఇంజిన్ లోని సమస్యల వల్ల కూలిపోయిందని తెలిపాడు. కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రమాదానికి పాల్పడ్డాడని దర్యాప్తు టీం నిర్ధారించింది. అతనిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.