చిన్న పిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్ని బొమ్మలను చూస్తుంటే పెద్దవాళ్లకు కూడా తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇప్పుడు ఆ బొమ్మలంటే భయంతో వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్‌లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్, సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. ప్రపంచ దేశాల్లో చైనా వస్తువులు వాడని దేశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. మేడిన్ చైనా అనే వస్తువు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. చైనా వస్తువుల ధరలు కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు వాటికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అందుకే చైనా ప్రపంచ దేశాలన్నింటిలోనే తన మార్కు మార్కెట్ ను కొనసాగించగలుగుతోంది.
చైనాలో తయారైన ఈ బొమ్మలు కూడా అమెరికాకు వచ్చిన బాక్సుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. ఇక ఆన్‌లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.