అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకి అమెరికా విదేశాంగ శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు పొందే వెసులుబాటు కల్పిస్తూ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునః ప్రారంభమైన తరుణంలో ఇంటర్వ్యూలు లేకుండా వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను ఆదేశించింది. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎమ్, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే కేటగిరీ వీసా దరఖాస్తుదారులకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని తెలిపింది. వీసా గడువు తేదీ ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెన్యువల్ చేయించుకునే వారికి ఇంటర్వ్యూ లేకుండా వీసా పొందవచ్చునని వెల్లడించింది.
అయితే గతంలో వీసా రిజెక్ట్ అయిన వారికి ఈ నిబంధన వర్తించదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంటర్వ్యూ ప్రక్రియ లేదని చెప్పినప్పటికీ.. పాండమిక్ అంతరాయం కారణంగా ఢిల్లీలో ఉన్న యూఎస్ ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబై కాన్సులేట్స్ లో నాన్ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే చాలా మంది వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించి ఇప్పటికీ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
వీరి కోసం యూఎస్ మిషన్ అపాయింట్మెంట్ వ్యాలిడిటీని సెప్టెంబర్ 30 2023 వరకూ పొడిగిస్తున్నట్లు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. ఇంటర్వ్యూ లేని వీసా అపాయింట్మెంట్లను వేగంగా పొందాలంటే ‘ustraveldocs.com’ పోర్టల్ ని విజిట్ చేయమని యూఎస్ ఎంబసీ పేర్కొంది. అప్లికేషన్ రిక్వస్ట్ అప్రూవ్ అయితే ఈమెయిల్ కి నోటిఫికేషన్ వస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా వేగంగా అపాయింట్మెంట్ పొందే స్లాట్స్ పరిమితంగా మాత్రమే ఉన్నాయని తెలిపింది. మరి భారతీయుల కోసం ఇంటర్వ్యూ లేకుండా వీసా మంజూరు చేయడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.