మనిషి వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒక్కో అవయవం పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే మెదడు ఇలా మొద్దుబారిపోతుందో, పనిచేయడం ఆగిపోతుందో అప్పుడే గత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మెమొరీని డిలిట్ చేసినట్టు. అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కష్టం. ఈ పరిస్థితినే అల్జీమర్స్ అంటారు. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బతింటాయి. క్రమంగా శరీర కార్యకలాపాలు ఆగిపోయి, మరణం సంభవిస్తుంది. అయితే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి సంగీతం మంచి సాధమని ఇదివరకే పరిశోధనలు నిరూపించాయి. మన ప్రతి జీవితంలో సంగీతం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో అల్జీమర్స్ బారిన పడిన కొంతమంది సంగీత సాధనలో, లయబద్ధంగా, శృతి తప్పకుండా ఏ మాత్రం తడబడకుండా ఆయా వాయిద్యాలను వాయించడంలో అద్భుతంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
తమ వారిని తలుచుకొని కొంతమంది భావోద్వేగానికి లోనవుతోంటే వారి ప్రతిభకు మేని పులకరించిందంటూ మరి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాస్త్రవేత్త హెన్రీ లాంగ్ ఫెలో చెప్పిన మాట “సంగీతం మానవజాతి యొక్క విశ్వ భాష” అని సీజీఓ జావా, జుబిన్ మెహతాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ ఆర్కెస్ట్రా కండక్టర్, సంగీత దర్శకుడు జుబీన్ మెహతా, అమెరికా ఆర్కెస్ట్రా కండక్టర్, సీజీ ఓజావా ఈ సంగీత కార్యక్రమానికి నేతృత్వం వహించడం విశేషం. హారున్ రషీద్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. స్వయంగా అల్జీమర్స్ బాధితుడైన సీజీ ఓజావా సంగీతాన్ని ఏమాత్రం మర్చిపోలేదంటూ కమెంట్ చేశారు. అయితే 2016 నాటి వీడియో ఇదనీ, సీజీ ఓజావాకు అల్జీమర్స్ వ్యాధిలేదనీ, క్యాన్సర్‌తో బాధపడుతున్నారని మరో యూజర్ వివరణ ఇచ్చారు.