తల్లిని మించిన యోధుడు ఈ ప్రపంచంలోనే లేడు అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి మరో బిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆ బిడ్డే తన కన్నా ముందు చనిపోతే.. తల్లి బాధ వర్ణనాతీతం. అయితే కుమారుడి చివరి కోరిక తీర్చేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..?
ప్రపంచంలో ఏ బంధం గొప్పది అంటే అమ్మనాన్నలదే. ఆ తర్వాతే ఏ బంధమైనా. ముఖ్యంగా తల్లి, కుమారుడు లేదా తండ్రి, కూతుళ్ల మధ్య అనుబంధం మరువలేనిది. ఇందులో తల్లి ప్రేమ కమనీయం. తల్లిని మించిన యోధుడు ఈ ప్రపంచంలోనే లేడు అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి మరో బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డలు సరిగా తినకపోయినా లాలించి, బుజ్జగించి.. సేవలు చేస్తుంది. తల్లి త్యాగశీలి కూడా. తన అవసరాలను పక్కన పెట్టి.. పిల్లల అవసరాలను తీస్తుంది. వారి బంగారు భవితవ్యానికి బాటలు వేస్తోంది. అమ్మ సేవా నిరతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదీ సామాన్యులయినా, స్టార్ హోదాలో ఉన్న తల్లి తల్లే అని నిరూపించిందీ ఈ నటి.
కుమారుడు చివరి కోరిక తీర్చాలని భావించిన ఓ నటి.. చట్ట విరుద్ధం అయినప్పటికీ, ఓ పని చేసి మరోసారి మాతృత్వపు ఆనందాన్ని పొందేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే స్పానిష్ టీవీ స్టార్ నటి అనా ఒబ్రెగాన్.. తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను నాన్నమ్మను అయ్యానని తెలిపింది. అయితే ఆమె కుమారుడు 2020లో క్యాన్సర్‌తో చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఇప్పుడు ఆమె నాన్నమ్మ ఎలా అయిందని అనుకుంటున్నారా. స్పెర్మ్ దాచడం ద్వారా. తన చనిపోయిన కొడుకు ద్వారా యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఓ మహిళా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది. ఒబ్రెగాన్ కొడుకు ‘అలెస్’ (అలెజాండ్రో లెక్వియో గార్సియా) 27 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో పోరాడుతూ 2020లో చనిపోయాడు.
అయితే కుమారుడు బతికున్నప్పుడు ‘నాకంటూ ఓ సొంత బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలనేది నా చివరి కోరిక’ అని తనతో చెప్పేవాడని, దీంతో తన మరణానికి ముందే అతని స్పెర్మ్‌ను న్యూయార్క్‌లో నిల్వ చేసినట్లు ఒబ్రెగాన్ వెల్లడించింది. ఇక ఆ బిడ్డను మోసిన తల్లి ఫ్లోరిడాలో నివసిస్తున్న క్యూబా మూలానికి చెందిన మహిళట. పుట్టిన పాపను చూపిస్తూ.. ‘ఈ అమ్మాయి నా మనవరాలు. స్పెయిన్‌లో ఒకరి బిడ్డకు మరో మహిళ జన్మనివ్వడం చట్టవిరుద్ధం అయినప్పటికీ, విదేశాలలో పుట్టిన బిడ్డను దత్తత తీసుకోవడం చట్టబద్ధం’అని స్పష్టం చేసింది. చనిపోయిన రెండేళ్ల తర్వాత నటి కుమారుడు అలా తండ్రయ్యాడు.