అనుకోని విమాన ప్రమాదంలో ఉన్నట్టుండి ఇండియా మూలాలున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
గతంలో జరిగిన ఎన్నో విమాన ప్రమాదాల్లో ఇప్పటికీ ఎంతో మంది ప్రయాణికులు మరణించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, ఉన్నట్టుండి విమానంలో మంటలు రావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా అనుకోని విమాన ప్రమాదాల్లో ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ మహిళ విమాన ప్రయాణంలో మరణించింది. ఆమెతో పాటు పైలెట్, ఆమె కూతురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగిదంటే?
భారతీయ మూలాలున్న రోమా గుప్తా(63), ఆమె కూతురు రీవా గుప్తా అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఈ తల్లీకూతురు కలసి చిన్న విమానంలో లాంగ్ ఐలాండ్ నుంచి బయలు దేరారు. ఎంతో సంతోషంగా తమ గమ్య స్థానానికి వెళ్లాలనుకున్నారు. కానీ, అంతలోనే వారు ప్రయాణిస్తున్న విమానంలోని కాక్ పిట్ నుంచి అనుకోకుండా పొగలు వచ్చి ఆ తర్వాత మెల్ల మెల్లగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో వెంటనే ఆ విమానాన్ని పైలెట్ కిందకు దించే ప్రయత్నం చేశారు.
కానీ, అప్పటికే ఆ మంటల్లో రోమా గుప్తా ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా విమానంలో ఉన్న మృతురాలి కూతురు రీవా గుప్తా, పైలెట్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కొందరు అధికారులు తీవ్రంగా గాయపడిన రీవా గుప్తా, పైలెట్ ను ఆస్పత్రికి తరలించారు. రీవా ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విమానం ప్రమాదంలో రోమా గుప్తా మరణించడం, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.