ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత.. ఓ ఏజ్ వచ్చాక ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే త్వరగా పెన్షన్ తీసుకోవాలనే ఆశతో ఏకంగా తన జెండర్‌నే మార్చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ వృద్ధుడు. పెన్షన్‌కు, జెండర్ మార్పుకు సంబంధం ఏమిటనేగా మీ సందేహం.. దీని గురించి తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.
స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్ చట్టంలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం.. పౌరులు తమ దరఖాస్తుల్లో తమకు నచ్చిన జెండర్‌ను రాయొచ్చు. అవసరమైతే మార్పులు కూడా చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం మహిళలు 64 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని పెన్షన్ తీసుకోవచ్చు. పురుషులు మాత్రం ఏడాది కాలం ఎక్కువగా అనగా 65 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని పెన్షన్ తీసుకోవాలి. దీంతో ఓ పెద్దాయన తన జెండర్‌ను మేల్ నుంచి ఫిమేల్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆలస్యం ఎందుకు అనుకున్నాడేమో.. వెంటనే తాను పురుషుడిని కాదు.. మహిళను అంటూ ప్రకటించుకున్నాడు. తన రిటైర్మెంట్‌కు అనుమతి ఇచ్చి.. పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే చట్టం ప్రకారంఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వ అధికారి ఒకరు ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. చట్టంలో మార్పులు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. త్వరగా రిటైర్మెంట్ పొందేందుకు ఓ ఉద్యోగి.. తనను మహిళగా ప్రకటించుకున్నాడనే వార్త వైరల్‌గా మారడంతో.. మరికొంతమంది ఉద్యోగులు ఆ చట్టంలో ఉన్న లొసుగుల గురించి వెతకడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అలానే స్విట్జర్లాండ్ లో 18 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు సైన్యంలో చేరాలి. తప్పనిసరిగా సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలనే నిబంధనలను తమ అనుకూలంగా మార్చుకొనేందుకు ఈ చట్టాన్ని అవకాశంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సైన్యంలో చేరకుండా తప్పించుకొనేందుకు అబ్బాయిలు 17 ఏళ్ల వయస్సు లోపు తమ జెండర్‌ను ఫీమేల్ అని దరఖాస్తుల్లో రాస్తున్నారట. మళ్లీ ఎప్పుడైనా పురుషుడిగా మార్పు చేసుకునే అవకాశం ఉండడంతో ఆ పెద్దాయనలానే చేద్దాంలే అనుకుంటున్నారట. ప్రస్తుతం పెద్దాయన అభ్యర్థన కోర్టు పరిశీలనలో ఉంది. మరి, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.