ప్రస్తుతం అంతా డేటింగ్, చాటింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. అయితే వయసులో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త అర్థం ఉంటుంది. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు.
ఇప్పుడు డేటింగ్, మీటింగ్, చాటింగ్ అనే పదాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఎవరిని కదిలించినా వీటి గురించే ప్రస్తావన. అయితే వయసుకు తగ్గట్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త చెప్పకోడానికి, చూడటానికి బాగుంటాయి. కానీ, కొందరు వయసుతో సంబంధం లేకుండా ఇలా డేటింగ్, చాటింగ్ అంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి విషయాలకు కక్కుర్తి పడితే వాటి పర్యావసానాలు ఒక్కోసారి కాస్త కష్టంగానే ఉండచ్చు. అలా కక్కుర్తి పడిన ఒక 55 ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు. అతని ఆశను క్యాష్ చేసుకున్న మహిళ అతడిని నిండా ముంచేసింది. అంతా కోల్పోయాక మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
ఈ ఘటన హాంక్ కాంగ్ లో జరిగింది. ఇటలీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి హాంక్ కాంగ్ లో నివసిస్తూన్నాడు. అతనికి టిండర్ లో ఒక యువతి(యువతిగా చెప్పుకుని) పరిచయం అయ్యింది. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పరిచయం చేసుకుంది. వీళ్ల పరిచయం కాస్తా ముదిరి.. వాట్సాప్ చాటింగ్ ల వరకు వచ్చింది. ఆ వ్యక్తితో కాస్త క్లోజ్ అయిన తర్వాత ఆ యువతి ఒక ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పింది. డిజిటల్ మనీలో పెట్టుబడులు పెడితే లాభాలు బాగుంటాయంటూ నమ్మబలికింది. ఆ తర్వాత అతను ఆ యాప్ లో సైన్ ఇన్ అయ్యాడు. కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అలా మొత్తం 14.2 మిలియన్ హాంకాంగ్ డాలర్స్(రూ.14 కోట్లు) ఇన్వెస్ట్ చేశాడు. ఇదంతా ఫిబ్రవరి నెలలో జరిగింది. అయితే అతను పెట్టిన డబ్బు ఎంతకీ వెనక్కి రావడం లేదు.
ఎందుకంటే స్కామర్స్ మొత్తాన్ని మార్చి 6 నుంచి 23 మధ్యలో 22 ట్రాన్సాక్షన్స్ లో ఖాళీ చేశారు. లాభాల సంగతి పక్కన పెడితే అసలు కూడా వెనక్కి రాకపోవడంతో అంకుల్ కి విషయం అర్థమైంది. తాను మోస పోయిన విషయాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆన్ లైన్ మోసాలు ఈ స్థాయిలో జరుగుతున్న రోజుల్లో ముక్కు మొఖం తెలియకుండా అంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన ఈ వ్యక్తిని చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అసలు అలా ఎలా నమ్ముతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మోసాలపై పోలీసులు చైతన్య పరుస్తూనే ఉన్నారు.