కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు. సోషల్ మీడియాలో ప్లాస్మా దానం చేయండి అంటూ విపరీతమైన సందేశాలు వెల్లువెత్తయి. ఇటీవల పరిశోధకులు అటువంటిది ఏమీలేదు. ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదు అంటూ చెప్పారు. అశాస్త్రీయంగా, అహేతుకంగా ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు సరైనా ఆధారాలు లేవని కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ప్లాస్మా థెరపీతో ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని హెచ్చరిస్తూ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ చీఫ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్‌కు లేఖలు రాశారు.
ఈ నేపథ్యంలో జరిగిన భారత వైద్య పరిశోధన మండలి– కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ప్లాస్మా థెరపీని చికిత్సా విధానం నుంచి తప్పించాలని సభ్యులందరూ అభిప్రాయపడటం తెల్సిందే. కరోనా మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగపడటం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. అంతేకాదు కరోనా తీవ్రం అవ్వకుండా అడ్డుకోవడంలోనూ ఈ చికిత్సా విధానం పెద్దగా ప్రయోజనం చూపడం లేదని ఐసీఎంఆర్ తెలిపింది.