మూఢనమ్మకం ముసుగులో వ్యాపారం జరుగుతుందా? ఒక పాస్టర్ అమాయకులను చనిపోయేలా ప్రేరేపించి వారి అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడా? ఇప్పటి వరకూ ఈ పాస్టర్ వల్ల 200 మందికి పైగా చనిపోయారు. తను చెప్పిన విధంగా చనిపోతే జీసస్ ని కలిసే అదృష్టం వస్తుందని వందల మంది చావులకు కారణమయ్యాడు.
దేవుడంటే నమ్మకం ఉండవచ్చు కానీ మరీ మూఢనమ్మకం ఉండకూడదు. అది ఏ మతమైనా సరే, మనిషికి అంత మంచిది కాదు. చేతబడులు చేయిస్తేనో, నరబలులు ఇస్తేనో దేవుడు కరుణిస్తాడని కొంతమంది గుడ్డిగా నమ్ముతారు. ప్రేయర్ ఆయిల్ రాసుకుంటే క్యాన్సర్, ఎయిడ్స్, కరోనా వంటి పెద్ద పెద్ద రోగాలు పోతాయని కొంతమంది పాస్టర్లు ఇప్పటికీ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. జనం కూడా పాస్టర్లకు తగ్గట్టే అజ్ఞానంలో పడి మునిగిపోతున్నారు. పాస్టర్లకు, వారి వద్ద ఉన్న ప్రేయర్ ఆయిల్ కి అంత శక్తే ఉంటే ఇన్ని వేల ఆసుపత్రులు ఎందుకు ఉంటాయి? ఇన్ని వేల మంది వైద్యులు ఎందుకు ఉంటారు? ఇంతమంది ఉన్నా రోజూ కొన్ని లక్షల మంది ఎందుకు చనిపోతారు? కనీస ఆలోచన లేకుండా ఎవరో చెప్పారని గుడ్డిగా అనుసరించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా ఒక పాస్టర్ మాట నమ్మి 201 మంది ప్రాణాలు విడిచారు. 2019లో పాల్ మెకంజీ అనే పాస్టర్.. అటవీ ప్రాంతంలోని కిలిపీ వద్ద 800 ఎకరాల్లో విస్తరించిన ప్రదేశంలో మకాం వేశాడు. అక్కడ తన అనుచరులను పోగేసి.. వారిని ఆహారం తినకుండా ఆకలితో మరణిస్తే ఏసు ప్రభుని కలిసే అదృష్టం వరిస్తుందని చెప్పాడు. దీంతో వారంతా నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. అయితే ఆకలికి తట్టుకోలేక చనిపోయిన వారిని అక్కడే అదే ప్రాంతంలో సామూహిక ఖననం చేశారు. ఈ విషయం కెన్యా అధికారులకు తెలియడంతో పాల్ మెకంజీని అదుపులోకి తీసుకున్నారు. 200కు పైగా మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్షలు చేయగా.. ఆహారం తినకపోవడం, గొంతు నులమడం, అలానే బలమైన ఆయుధాలతో దాడి చేసిన కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.
గత నెల నుంచి అధికారులు మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. శనివారం నాడు ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 600 మంది మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా రహస్య ప్రదేశంలో నిరాహార దీక్ష చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అవయవాలు అమ్ముతున్నట్లు పాస్టర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు, మూడు సార్లు అరెస్ట్ అయ్యాడు ఈ పాస్టర్. చర్చిలో చిన్నారులు మృతికి కారణమైన ఈ పాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత అడవిలోకి మకాం మార్చాడు. అయినప్పటికీ దురాగతాలు ఆగకపోవడంతో గత నెలలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు.
ఇప్పటి వరకూ 201 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 112 మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 610 మంది మిస్ అయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అధికారులు మెకంజీ ఉన్న ప్రదేశంలో దాడులు చేసి చాలా మంది బాధితులను రక్షించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెన్యాలో మతపరమైన దురాచారాలను గుడ్డిగా పాటించే అలవాటు ఉంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో.. మరెక్కడైనా ఇలాంటి దురాచారాలను ఆచరిస్తున్నారేమో గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఆకలితో చస్తే దేవుడ్ని కలిసే అదృష్టం కలుగుతుందని చెప్పి 200 మందికి పైగా చావులకు కారణమైన ఈ పాస్టర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.