పట్టుదలతో చేస్తే సమరం.. తప్పుకుండా నీదే విజయం’అని సినీ కవి రాసినట్లు.. ఏదైనా సాధించాలన్న కసి ఉండాలే కానీ వైఫల్యం కూడా మన ముందు తల వంచుతుంది. చదువు, ఉద్యోగాల్లోనే కాదూ ఏ వృత్తి, వ్యాపారాల్లో అయిన కృషి, పట్టుదల ముఖ్యం.
‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పుకుండా నీదే విజయం’అని సినీ కవి రాసినట్లు.. ఏదైనా సాధించాలన్న కసి ఉండాలే కానీ వైఫల్యం కూడా మన ముందు తల వంచుతుంది. చదువు, ఉద్యోగాల్లోనే కాదూ ఏ వృత్తి, వ్యాపారాల్లో అయిన కృషి, పట్టుదల ముఖ్యం. అనుకున్నది సాధించే వరకు కొంత మంది నిద్ర పోరు. అటువంటి వారిలో నేటి యువతీయువకులు ముందు వరుసలో ఉంటారు. అత్యంత చిన్న వయస్సులోనే అనేక విషయాలపై పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నేటి యువత. పది మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో ఈ యువతి కూడా ఉంది. చదివేదేమో ఇంటర్మీడియట్ కానీ విదేశీ భాషలపై మంచి పట్టును సంపాదించుకుని ఔరా అనిపిస్తుంది.
మీకు ఎన్ని భాషలు వచ్చు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మేనేజ్ చేస్తారు. అదే ఆయా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే ఆ భాషపై పట్టు సాధించుకోగల్గుతాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే యువతి మాత్రం ఈ మూడు భాషలే కాదూ విదేశీ భాషలను కూడా అనర్గళంగా మాట్లాగలదు. ఆ యువతి పేరు మన్నూరు ఇందు రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజం పేట మండలం కారంపల్లి అనే చిన్న గ్రామంలో పుట్టిన ఇందు.. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (ప్లస్ 2) చదువుతోంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ కాకుండా విదేశీ భాషలపై పట్టు సాధించింది.
జపనీస్, థాయ్, కొరియన్, చైనీస్ తో సహా 6 విదేశీ భాషలను అవపోసన పట్టిన ఈ యువతి.. మాట్లాడటమే కాదూ.. చదవడం,రాయడం కూడా చేస్తోంది. అంతేనా.. తన విద్యను దాచుకోకుండా పది మందికి నేర్పుతుంది. విదేశాల నుండి వచ్చే వైద్యులకు ట్రాన్సులేటర్ గా మారి తన భాషా ప్రావీణ్యాన్ని చాటుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టార్ హోటల్ సిబ్బందికి ఆమె విదేశీ భాషలను నేర్పుతుంది. వివిధ మాధ్యమాల ద్వారా కష్టపడి సొంతంగానే ఇవన్నీ నేర్చుకోవడం విశేషం. అలాగే మరిన్ని భాషలను నేర్చుకునేందుకు సిద్ధమైంది ఇందు.