ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్‌ను తిప్పేశాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 150 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్(44), అక్షర్ పటేల్(52) ఆకట్టుకున్నారు.
ఇక ఈ ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లను అజాజ్ పటేల్ పడగొట్టి రికార్డు సృష్టించాడు. కానీ ఈ ఆనందం కివీస్‌కు ఎంతో సేపు మిగల్లేదు. మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 62 పరుగులకే ఆలౌట్ చేశారు. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ ఓటమి దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్‌ను ఫాలోఅన్‌కు దింపకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ మయాంక్ అద్భుతంగా ఆడాడు. 108 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 62 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఎప్పుడూ లేని విధంగా మరో ఓపెనర్‌గా వచ్చిన పుజారా పర్వాలేదనిపించాడు. 47 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. శుభ్‌మన్ గిల్ కూడా 47 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కోహ్లీ(36), అక్షర్ పటేల్(41) పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక 540 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు మరోసారి తక్కువ స్కోర్‌కే ప్యాకప్ చేశారు. అశ్విన్ 4, జయంత్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగి కివీస్‌ను 167 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 372 పరుగుల తేడాతో భారీ విజయంతో పాటు సిరీస్‌ను కూడా గెలిచింది.