దేశం ఎప్పుడూ చూడని కష్టాలని ఇప్పుడు చూస్తోంది. దీనికి కారణం కరోనా. ఇప్పటికే దేశంలోని అన్నీ రంగాలు దీని దెబ్బకి కుదేలయ్యాయి. మరో వైపు ప్రజల ప్రాణాలకి సైతం గ్యారంటీ లేకుండా పోయింది. దేశంలో వైద్య రంగం కూడా చేతులు ఎత్తేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. మరి సెకండ్ వేవ్ కే ఇంత దారుణంగా ఉంటే.., థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ చెమటలు పట్టిస్తోంది. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ.., రావడం మాత్రం పక్కా అని నిపుణులు అంటున్నారు. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరిన్ని మార్పులు చెందనుందని…భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ లో మన దేశంలో బి1.617 వేరియంట్ ఉంది. ఈ వేరియంట్ లో వైరస్ వేగంగా ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తిస్తోంది. అలాగే.., ఒక్కసారి వైరస్ శరీరంలోకి వెళ్ళాక చాలా త్వరగా ఇతర అవయవాలపై దాని ప్రభావం చూపిస్తోంది. ఇందుకే సెకండ్ వేవ్ లో ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి. మరి థర్డ్ వేవ్ లో ఎలాంటి వేరియంట్ పుట్టుకొస్తుంది అన్న విషయం మీద తీవ్రత స్థాయి ఆధారపడి ఉంటుంది.
మరోవైపు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోవిడ్ థర్డ్ వేవ్‌పై సంచలన హెచ్చరికలు చేశారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్ లను తట్టుకుని నిలబడేలా వ్యాక్సిన్ తాయారు చేసుకోవాలని, లేకుంటే పెను ప్రమాదం తప్పదని సుబ్రమణ్యస్వామి సూచించడం విశేషం.తాజగా ప్రాముఖ శాస్త్రవేత్త విజయరాఘవన్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. కరోనా థర్డ్ వేవ్ తప్పక వినాశనాన్ని సృష్టిస్తుంది. థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని ఆయన తెలియచేశారు. నిజానికి కరోనా ఇప్పటి వరకు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపించలేదు. ఇప్పటి వరకు మన దేశంలో కేవలం 20 శాతం మంది చిన్నారులే వైరస్ బారిన పడ్డారు. కానీ.., మూడో దశ వస్తే 85 శాతం మంది చిన్నారులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కేవలం చిన్నారులే 20 కోట్ల మంది ఉండటం గమనార్హం. మరి ఈ విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి పరిస్థితిని అదుపులోకి తెస్తుంది ఏమో చూడాలి.