న్యూ ఢిల్లీ- భారత్ లో ఎన్డీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో మొదటి సారి, 2019లో రెండవ సారి అధికారం చేపట్టిన ఎన్డీఏ నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకుంది. మోదీ భారత ప్రధానిగా విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ రికార్డ్ నెలకొల్పారు.
2024లో జరిగే ఎన్నికల్లోను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈమేరకు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సహా, బీజేపీ ముఖ్య నేతలంతా పూర్తిగా ఆయా రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి సారించారు.
ఇదిగో ఇటువంటి సమయంలో ప్రముఖ జాతీయ మ్యాగజైన్ ఇండియా టుడే భారత్ లో మూడ్ ఆఫ్ నేషన్ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో చెప్పింది ఇండియా టుడే. ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 543 స్థానాలున్న లోక్ సభలో ఎన్డీయేకు 296, యూపిఏకు 127, ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్‌కు 62, ఇతరులకు 210 స్థానాలు దక్కుతాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది.