స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే క్రికెట్ అభిమానులకు మళ్లీ పండగ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీకి సంబందించి ముందు నుంచి వివాదాలు చెలరేగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ అని చెప్పవచ్చు. అసలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉంది.
కానీ, భారత్ లో కరోనాసంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, ఒమన్ వేదికల్లో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పాల్గొనే జట్లు అన్నీ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021 అనే లోగో ఉన్న జెర్సీలను ధరించాల్సి ఉంది.
కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాత్రం అందుకు భిన్నంగా టోర్నీని యూఏఈ పేరుతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈ 2021 ఉన్న జెర్సీలతో ఫొటో షూట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చలరేగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చేసిన ఈ వివాదాస్పద చర్యపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈనెల 24న ఆదివారం టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా టీంఇండియా పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఇదిగో ఇటువంటి సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వక్ర బుద్ది కాస్త సక్రమంగా మారింది.
ఇంతకు ముందు పాక్ జెర్సీపై ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈ 2021 ఉన్న లోగోను మార్చి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021 అనే లోగోను ఆవిష్కరించారు. ఇంకేముంది పాకిస్ఠాన్ క్రికెట్ జట్టు జెర్సీపై మన ఇండియా పేరు వచ్చేసింది. ఇప్పుడు ఈ వివాదానికి తెరపడిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఈనెల 24న ఆదివారం యూఏఈలో జరగనున్న ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.