న్యూ ఢిల్లీ- కరోనా మరోసారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా రోజు వారి కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. డిసెంబరు 27 నుంచి పాజిటివ్ కేసులు రాకెట్ వేగంతో దూసుకెళుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 91 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
అంతకు ముందు రోజు మంగళవారం నమోదయిన 57,973 కేసులతో పోల్చితే 56.6 శాతం అధికంగా కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ మొదలైన తర్వాత వరుసగా రెండు రోజులు పాజిటివిటీ రేటు 50 శాతం దాటడం ఇదే మొదటిసారని అధికారులు చెప్పారు. ఈ వారంలో సోమవారం 34 వేల కరోనా కేసులు బయటపడగా, మంగళవారానికి ఆ సంఖ్య 57 వేలకు చేరింది.
ముందు రోజుతో పోల్చితే బుధవారం ఏకంగా 33 వేలకుపైగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 26,538 కరోనా కేసులు నమోదవ్వగా, ఒక్క ముంబైలోనే 15,166 కేసులు నమోద్యాయి. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 797కి చేరుకుంది. ఇక ఢిల్లీలో కొత్తగా 10,665 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ్ బెంగాల్‌లో కొత్తగా 14,022 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో 6,170 కేసులు కోల్‌కతాలో ఉన్నాయి.
కేరళలో 4,801 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 4,246 కేసులు నమోదుకాగా, బెంగళూరులోనే 3,605 మందికి కరోనా సోకింది. బీహార్‌లో 1,659 కేసులు, హిమాచల్ ప్రదేశ్‌లో 374 పాజిటివ్ కేసులు, గుజరాత్లో కొత్తగా 3,350 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులోనే అధికంగా కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది.