అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి బ్యాంకు అకౌంట్స్ లో జీతాలు జమయ్యాయి. జగన్ సర్కార్ అనుకున్నమేరకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలను చెల్లించారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఉద్యోగులకు ఎంతమేర జీతాలు పెరిగాయో చెప్పడంతో పాటు, ఉద్యోగుల పే స్లిప్ లను విడుదల చేశారు.
ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఈ సందర్బంగా సమీర్ శర్మ చెప్పారు. ఐఆర్ ఉన్నా, ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుందని ఆయన అన్నారు. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారని, గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తే జీతంలో ఎక్కువ పెరుగుదల ఉందని సమీర్ శర్మ తెలిపారు. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉందని, ఎవ్వరికీ జీతాలు తగ్గలేదని చెప్పారు.
మంగళవారం రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక ఆ విషయం ఉద్యోగులందరికి అర్ధమవుతుందని సీఎస్ సమీర్ శర్మ అన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలని, పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉందని వివరించారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమని, ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామని, సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సమీర్ శర్మ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వారి ఖాతాల్లో జమ చేశారు. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించారు. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు వారి బ్యాంకు అకౌంట్స్ లో జమ చేశారు. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించారు. ప్రతి ఉద్యోగికి శాలరీ బ్రేక్ అప్ తో కూడిన పే స్లిప్ ను అందించింది ప్రభుత్వం. ఓ ఉద్యోగికి గత నెల 48,975 నెట్ సాలరీ రాగా, ఈనెల 6,335 పెరుగుదలతో 55,310 నెట్ సాలరీ వచ్చినట్లు పే స్లిప్ లో వివరాలు పొందుపరిచారు.