జీవితంలో ఎదగాలన్న కోరిక బలంగా ఉంటే.., నిత్యం ఎదురయ్యే సమస్యలను దాటడం పెద్ద కష్టం ఏమి కాదు. ఇలాంటి ఎన్నో అవాంతరాలను దాటి విజేతలుగా నిలిచిన వారు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు. అలాంటి ఓ విజేతే 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్ గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. కలెక్టర్ కాకముందు వన్మతిది ఓ నిరుపేద కుటుంబం. తండ్రి ట్రక్ డ్రైవర్. తల్లి పాడిని నమ్ముకుంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది. పశువులతో అమ్మకి చాకిరీ ఎక్కువ కావడంతో.. వన్మతి కూడా పశు పోషణలో తల్లికి సాయం చేసేది. కానీ.., ఎక్కడా చదువుని మాత్రం అశ్రద్ధ చేయలేదు. నిద్ర లేచిన దగ్గర నుండి ఒకవైపు తన చదువు, మరోవైపు పశు పోషణ. ఈ రెండే వన్మతి లోకం అయిపోయింది. తాను బాగా చదువుకుని తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని ఆమె అప్పుడే నిర్ణయించుకుంది. ఇందుకోసం తాను కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంది. ఒకవైపు కాలేజీ విద్యని కొనసాగిస్తూనే.., పశువులను పచ్చిక కోసం తోలుకుపోయేది వన్మతి. ఇలా ఆమె తన డిగ్రీని పూర్తి చేసింది. అంతకు మించి చదివించే శక్తి ఇంట్లో వాళ్ళకి లేకుండా పోయింది. తన ఆశయం కోసం కన్నవారిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్న వన్మతి ఓ ప్రయివేట్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరింది. అలా ఉద్యోగం చేస్తూనే.., సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించింది. ఆమెకి తల్లిదండ్రుల అండ కూడా లభించింది. కూతురు ఆశయాన్ని వారు గౌరవించడం మొదలుపెట్టారు. వారి ప్రోత్సాహంతో ఆమె తన లక్ష్యంపై గురిపెట్టింది. దృష్టంతా చదువుపైనే. తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా ఆమెని పరాజయం వెక్కిరించింది. ఈసారి మరింత కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి మాత్రం విజయం వన్మతిని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్ లో 152 ర్యాంకుతో వన్మతి ప్రభంజనం సృష్టించింది. ఇక ఉద్యోగం ఖాయం అనుకుంటున్న స్థితిలో ఆమెని దురదృష్టం మరో రూపంలో వెంటాడింది. ఇంటర్వ్యూకి ఇక రెండు రోజులే ఉందనగా వన్మత తండ్రి వెన్ను నొప్పితో ఐసియూలో జాయిన్ అయ్యాడు. జీవితమంతా డ్రైవర్ గా గడిపిన ఆమె తండ్రి వెన్నెముక ఆరోజుతో రెస్ట్ తీసుకుంది. కన్న తండ్రి ఐసీయూలో పోరాడుతూ ఉండగానే.., వన్మత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. అక్కడ కూడా తన తెలివి తేటలతో అధికారులను మెప్పించింది. అలా ఆమెకి పోస్టింగ్ కన్ఫర్మ్ అయ్యింది. అలా లాల్ బహుదుర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణని పూర్తిచేసుకొన్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. అక్కడ నుండి ఆమె తిరిగి చూసుకుంది లేదు. ఇది వన్మతి నిజ జీవిత కథ. ఒక్క అపజయంతోనే కుంగిపోయే నేటి యువతరానికి వన్మతి పట్టుదల, ప్రయాణమే ఒక స్ఫూర్తి.