గాంధీజీ నాకు ఎందుకులే అనుకుని ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. మదర్ థెరీసా నావల్ల కాదులే అనుకుని ఉంటే ఈరోజు మానవత్వానికి అర్ధం లేకుండా పోయేది. బుద్ధుడు ఆనాడు ఒక్క అడుగు ముందుకి వేయకుంటే.., ఈరోజు ప్రపంచానికి ఓ శాంతి మార్గం లేకుండా పోయేది. ఇవన్నీ కూడా వారు ఏదో ఆశించి చేసిన పనులు కాదు. వారు ఆ పనుల్లోనే ప్రశాంతత వెతుకున్నారు. పక్క వారి కళ్ళల్లో కన్నీరు చూస్తే.., మన గుండెల్లో బాధ కలగాలన్న మానవతా సత్యాన్ని చాటారు. ఈరోజుల్లో ఇలాంటి మానవతా మూర్తులు చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ.., ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో కూడా ఓ వ్యక్తి తన మంచి మనసుని చాటుకుంటున్నాడు. అతనే హైదరాబాద్కు చెందిన తరుణ్. చేసేది సాఫ్ట్ వేర్ జాబ్. లక్షల్లో శాలరీ. విలాసవంతమైన జీవితం. ఓ మంచి కుటుంబం. కానీ.., తరుణ్ కి ఇవేవి తృప్తిని కలిగించలేకపోయాయి. బతకడానికి అవసరం కాబట్టి జాబ్ చేయాలి. కానీ.., బతుకుతున్న ఈ బతుక్కి ఒక అర్ధం రావాలంటే ఏమి చేయాలని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆ మేధో మధనం వల్లే తరుణ్ లో మానవతా మూర్తి బయటకి వచ్చాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాస్త వెంటనే అంబులెన్స్ డ్రైవర్గా మారిపోయాడు. ప్రతిరోజూ కరోనా పేషంట్లను ఆస్పత్రులకు చేరుస్తూ సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు.
నిజానికి తరుణ్ ఉన్నత చదువుల కోసం ముందుగా అమెరికా వెళ్లాడు. తర్వాత అక్కడే 8 సంవత్సరాల పాటు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కానీ.., పోయిన ఏడాది తన తల్లికి కరోనా సోకడంతో ఇండియాకి తిరిగి వచ్చాడు. దగ్గరే ఉండి అమ్మకి అన్నీ సేవలు చేసి ఆమెని బతికించుకున్నాడు. ఇక తిరిగి విదేశాలకి బయలుదేరుదాం అనుకోగానే.. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఈ సమయంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి తరుణ్ చలించిపోయాడు. తన దేశ ప్రజల కోసం ఏమైనా చేయాలి అనుకున్నాడు. తన స్నేహితుల ద్వారా ఫండ్ రైజ్ స్టార్ట్ చేశాడు. తరుణ్ ప్రయత్నానికి ఎథ్నే అనే స్వచ్ఛంద సహకారం తోడైంది. దీంతో.., తరుణ్ ఒక ఓమ్ని వ్యానును కొనుగోలు చేశాడు. ఫండ్ రైజ్ ద్వారా వచ్చిన డబ్బులతో వ్యానును అంబులెన్స్గా మార్చాడు. అందులో ఆక్సిజన్ సిలిండర్, ప్రథమచికిత్సకు కావాల్సిన అన్ని సదుపాయాలను పొందుపరిచాడు. అప్పటినుంచి సాయంకోరిన ప్రతి ఒక్కరికీ చేయందిస్తున్నాడు. పేషంట్లను ఆస్పత్రులకు, ఐసోలేషన్ సెంటర్లకు చేరవేస్తున్నాడు. పైగా.. మందుల ఖర్చుల కోసం తన దగ్గరున్న డబ్బులను కూడా ఇస్తున్నాడు. ఒక్క రవాణా మాత్రమే కాదు. ఎంత అర్ధరాత్రి అయినా సరే.., ఎవరు ఏ సహాయం కావాలన్నా తరుణ్ అక్కడ వాలిపోతున్నాడు. తాజాగా.. తరుణ్ సేవలను మెచ్చుకుంటూ ప్రముఖ సబ్బుల కంపెనీ ‘డెటాల్’ తమ హ్యాండ్ వాష్ ప్రొడక్ట్లపై ఆయన ఫోటోను కూడా ముద్రించింది. ఇంత చేసినా.., తరుణ్ ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవడం లేదు. అమ్మ కోసమే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. పది మంది దీవెనలు ఉంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందన్న ఆశతోనే ఈ పనులు చేస్తున్నాని అంటున్నాడు. ఈ క్రమంలో తరుణ్ ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అంబులెన్స్ సేవలందించి.. ఆ తర్వాత తన జాబ్ చేసుకుంటున్నారు. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సేవ చేస్తున్నారు. ఏదేమైనా.., తన అమ్మ ఆరోగ్యం బాగుండాలని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న తరుణ్ ని ఆభినందించకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.