హైదరాబాద్- సమాజంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను, అమ్మాయిలను వేధించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వావి వరసలు, వయసు తారతమ్యాలు లేకుండా అందరిని వేధిస్తున్నారు దుర్మార్గులు.
తాజాగా హైదరాబాద్ లో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్ ను కొందరు ఆకతాయిలు వేధిస్తున ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో పాటు, టీచర్ గా పనిచేస్తున్న సదరు మహిళకు ఆశ్లీల ఫొటోలు పంపి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మానసికంగా వేధిస్తున్నారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో 44 సంవత్సరాల మహిళ కుటుంబ సభ్యులతో పాటు నివాసిస్తోంది. ఆమె టీచర్ గా పనిచేస్తూనే, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె స్మార్ట్ ఫోన్ కు అశ్లీల ఫొటోలు పంపిస్తున్నారు. అంతేకాదు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఆమె ఫోన్ కు ఫోన్ చేసి అసభ్యకరమైన రీతిలో మాట్లాడుతున్నారు.
ఆమెకే కాదు ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా అశ్లీల ఫొటోలు పంపుతున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఇల లాభం లేదని సదరు మహిళా టీచర్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అకతాయిలపై పోలీసులకు పిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.