హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెల్లు శ్రీనివాస్ యాదవ్(టీఆర్‌ఎస్), ఈటెల రాజేందర్(బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)తో మొత్తం 61 మంది 92 నామినేషన్లను దాఖలు చేశారు. 11న స్క్రూట్నీ, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంతమంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే ఉండనుంది. మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికలో ఎవరి అజెండాలు ఎలా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి వెనకబడ్డారు. ఆర్థికంగా చూస్తే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఉన్న ఆస్తులు చాలా తక్కువ. నామినేషన్ల సమయంలో వారు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ లో స్పష్టమవుతోంది. ఈటెల్ రాజేందర్ తనకు ఉన్న స్థిర, చర ఆస్తుల విలువ రూ.16.12 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి తనకు 59 లక్షల విలువైన ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇక అధికార పార్టీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ మాత్రం తనకు కేవలం రూ.22 లక్షల విలువ చేసే స్థిర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. కాగా రాజేందర్ సతీమణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తనకు రూ.43 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఆర్థికంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెనుకబడ్డారు.
ఇదే అంశం ప్రచారాస్త్రంగా మారనుందా?
ఎన్నికల ప్రచారంలో ఆర్థిక అంశం కూడా కీలకంగా మారనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే తాను ఆర్థికంగా చాలా చిన్నవాడ్ని అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి భావిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి జనాల్లో కూడా పాపం పేదవాడు అనే సింపతి క్రియేట్ అయితే ఓటింగ్ విషయంలో అది చాలా ఇంపాక్ట్ చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు.. ఇలా ఉన్నాయి.
ఈటెల జమున
మొత్తం ఆస్తులు: రూ.43 కోట్లు
డిపాజిట్లు: రూ.28.68 కోట్లు
స్థిరాస్తులు: రూ.14.78 కోట్లు
ఆభరణాలు విలువ: రూ.50 లక్షలు
వాహనాలు: ఇన్నోవా, సీఆర్‌వీ, క్రిస్టా
ఈటెల రాజేందర్
మొత్తం ఆస్తులు: రూ.16.12 కోట్లు
చర, స్థిరాస్తులు: రూ.16.12 కోట్లు
సొంతవాహనం: లేదు
బల్మూరి వెంకట్
మొత్తం ఆస్తులు: రూ.59.51 లక్షలు
ఒక సఫారీ కారు
గెల్లు శ్రీనివాస్ ఆస్తులు
మొత్తం ఆస్తులు: రూ.22.82 లక్షలు
చర, స్థిరాస్తులు: రూ.22.82 లక్షలు
సొంతవాహనం: లేదు
ఇదీ చదవండి: కేసీఆర్ తో గొడవపై అసలు నిజాలు బయటపెట్టిన ఈటల రాజేందర్