అనంతపురం క్రైం- ప్రస్తుత సమాజంలో హింస పెరిగిపోయింది. అది కూడా పవిత్రమైన భార్యా భర్తల మధ్య కలతలు చెలరేగిపోతున్నాయి. ఆలూ మగల మధ్య అనుమానం పెనుభూతమై ప్రాణాలను హరిస్తోంది. ఇదిగో ఇక్కడ భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, పరాయి మగవాళ్లతో మాట్లాడనని ఆమెను హామీ పత్రం రాసివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెపై హత్యయత్నం చేశాడా దుర్మార్గుడు.
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రజాక్‌కు, అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంథోని కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జూవనం సాగిస్తున్నారు. భార్య షర్మిల పరాయి మగాళ్లతో మాట్లాడుతోందని రజాక్ అనుమానిస్తూ వస్తున్నాడు. ఇదే విషయంపై నాలుగు నెలల క్రితం భార్యతో గొడవపడటంతో షర్మిల పుట్టింటికి వెళ్లింది.
మళ్లీ మూడు రోజుల కిందట ఆమె భర్త ఇంటికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఇదే విషయమై మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇకపై పరాయి మగాళ్లతో మాట్లాడనని హామీ ఇవ్వాలని, అందుకు అనుగునంగా తనకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని షర్మిలకు భర్త విచిత్రమైన కండీషన్ పెట్టాడు. ఐతే భర్త విధించిన షరతుకు భార్య ఒప్పుకోలేదు.
ఇలా రాసివ్వడం కుదరదని షర్మిల భర్తకు తేల్చి చెప్పింది. దీంతో కోపం కట్టలుతెంచుకున్న రజాక్, వంటిట్లో ఉన్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు షర్మిలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్యపై హత్యాయత్నం తరువాత రజాక్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యుప్తు చేస్తున్నారు.