అహ్మదాబాద్ క్రైం– కరోనా సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కరోనా వైరస్ భారిన పడాల్సిందే. ఇక కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం ఉంది. ఐతే ఓ మహానుభావుడు మాత్రం భార్యకు కరోనా సోకితే.. ఆతను చేసిన పని అందరిని ఔరా అనేలా చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోని ఓఅపార్ట్‌మెంట్‌లో కేతన్ పటాడియా, అమోలా పటాడియా అనే భార్య భర్తలు నివాసముంటున్నారు . రెండు రోజుల క్రితం ఈ అపార్ట్‌మెంట్‌లో మందు పార్టీ జరుగుతోందని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉండడంతో పోలీసులు వెంటనే కేతన్ పటాడియా ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చారు.
కేతన్ పటాడియా ఫ్లాట్ లోకి వెళ్లి చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఫ్లాట్ లో అతనితో పాటు అనురాధ గోయల్, షెఫాలీ పాండే, ప్రియాంక షా, పాయల్ లింబాచియా అనే నలుగురు మహిళలు తాగిన మైకంలో తూలుతూ కనిపించారు. అసలే మధ్య నిషేధం, ఆపై నలుగురు ఆడవాళ్లతో మందు పార్టీ, ఇదంటా ఎంటని కేతన్ ను అడిగారు పోలీసులు. దీనికి అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ తిన్నారు. ఈ మందు పార్టీ తన భార్య కోసమే చేసుకుంటున్నట్లు చెప్పడతను. తన భార్యకి ఈ మధ్యే కరోనా సోకిందని, ఆమె కరోనా నుంచి కోలుకున్న తరువాత డిప్రెషన్‌కి గురైందని చెప్పుకొచ్చాడు. అందుకే తన భార్య డిప్రెషన్ తగ్గించేందుకు ఆమె స్నేహితులతో కలిసి ఇంట్లో మందు పార్టీ చేసుకుంటున్నట్లు చెప్పాడు కేతన్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ మందు పార్టీలో కేతన్ భార్య అమోలా పటోడియా మాత్రం లేదు. ఆమె మరో రూంలో నిద్రపోతూ ఉంది.
డిఫ్రెషన్ లో ఉన్న భార్య నిద్రపోతుంటే.. ఆమె స్నేహితురాళ్లతో మందు పార్టీ చేసుకుంటే.. భార్య డిఫ్రెషన్ ఎలా నయం అవుతుందన్నది పోలీసులు మాత్రం అర్ధం కాలేదు. ఇదంతా మతకెందుకు అనుకున్నారో ఏమో గాని.. మధ్య నిషేధం అమలులో ఉన్న సమయంలో మందు తాగినందుకు కేతన్ తో పాటు, నలుగురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పోలీసులకు మందు పార్టీ గురించి లీక్ చేసింది ఈ నలుగురు మహిళల్లోని ఓ మహిళ భర్తేనట. తనను పార్టీకి పిలవనందుకు కోపంతో ఇలా చేశానని తరువాత చెప్పాడతను. భార్య డిఫ్రెషన్ లో ఉంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త.. ఇలా ఆమె స్నేహితురాళ్లతో తప్ప తాగి తందనాలాడటంపై ఆ ఆపార్ట్ మెంట్ వాసులంతా తిట్టిపోస్తున్నారు.