అత్త మామలతో పొసగక వేరు కాపురం పెట్టాలని భర్తను భార్య పోరు పెడుతోంది. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక భర్త నలిగిపోతుంటారు. అయితే వేరు కాపురం పెట్టాలని భార్య వేధిస్తే.. మొహమాటం లేకుండా భర్త ఈ నిర్ణయం తీసుకోవచ్చునని చెబుతోంది కలకత్తా హైకోర్టు.
పెళ్లైన తర్వాత అత్తింటినే సొంత ఇంటిగా భావించాలని పెళ్లి కూతురికి చెబుతారు తల్లిదండ్రులు. వారేమన్నాసర్ధుకుపోవాలని, అత్త, మామల్లో తల్లిదండ్రులను చూసుకోవాలని కుమార్తెకు చెప్పి పంపిస్తారు. కానీ కాపురానికి వెళ్లాక.. అత్త, కోడళ్ల మధ్య గొడవలు మొదలయ్యి.. చిలికి చిలికి గాలివానగా మారతాయి. రోజుకోక యుద్ధకాండలా ఇల్లు మారిపోతుంది. దీంతో వేరు కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి పెరుగుతుంది. భార్యను సముదాయించలేక భర్త తల ప్రాణం తోకకు వస్తుంది. అమ్మకు, ఇటు భార్యకు చెప్పలేక నలిగిపోతుంటారు. అయితే అటువంటి భర్త ఇక బాధపడాల్సిన అవసరం లేదని చెబుతోంది కలకత్తా హైకోర్టు.
తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చునని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సహేతుకమైన కారణాలు చెప్పకుండా.. అత్తమామల నుండి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తే, మానసిక క్రూరత్వానికి పాల్పడితే విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చి చెప్పింది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’ అని ఈ నెల 31న జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ ఉదయ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది.
వివరాల్లోకి వెళితే పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ మండల్‌కు 2001లో ఝార్నాతో వివాహమైంది. ప్రశాంత్ స్కూళ్లలో పార్ట్‌టైం టీచర్‌గా, పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి పనులతో కొంత సంపాదించేవాడు. అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఆ ఆదాయం సరిపోయేది కాదు. దీంతో, ఆమె వేరు కాపురం ఉందామని ప్రశాంత్‌ను వేధించడం మొదలు పెట్టింది. ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసుతో ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో ప్రశాంత్ విడాకుల కేసు దాఖలు చేయగా.. 2009లో విడాకులు మంజూరు చేసింది. అయితే మానసిక వేధింపుల కారణంగా విడాకులు మంజూరును సవాలు చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.