స్పెషల్ డెస్క్– హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డ్రగ్ కంపెనీ సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. ఈ ఐటీ సోదాల్లో భారీ మొత్తంలో నగదు దొరకడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారనంగా ఇలాంటి ఐటీ దాడుల్లో అక్రమాస్తులు ఎక్కువగా బయటపడుతుంటాయి. కానీ.. డ్రగ్ కంపెనీ సంస్థల్లో జరిగిన ఐటీ దాడుల్లో పెత్త మొత్తంలో నగదు దొరకడం గమనార్హం.
సంస్థలో ఇన్ కంటాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు దొరికింది. ఈ ఐటీ దాడుల్లో సుమారు 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు అధికారులు. ఇందులో ఏకంగా 142 కోట్ల నగదును గుర్తించారు. మొత్తం 6 రాష్ట్రాల్లో 60 చోట్ల 4 రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయి. ఆయా కార్యాలయాల్లో నగదును దాచిన తీరు చూసి ఐటీ అధికారులే నోరెల్లబెట్టారు.
వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. బీరువాల నిండా 500 నోట్ల కట్టలే కనిపించాయి. నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో 142 కోట్లు దాచారని అధికారులు తెలిపారు.
ఒక్కో ఇనుప అల్మారాలో 5 కోట్ల రూపాయల నగదు దాచారని ఐటీ అధికారులు తెలిపారు. డ్రగ్ కంపెనీలో జరిపిన సోదాల్లో దొరికిన డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందట. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో 550 కోట్ల రూపాయల బ్లాక్ మనీని గుర్తించగా, 142 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు.