ఇంటర్నేషనల్ డెస్క్- సౌత్ ఆఫ్రికాలో విషాదం చోటుచేసుకుంది. బంగారు గనిలో పేలుడు సంభవించింది. దీంతో సుమారు 59 మంది చనిపోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన బుర్కినాఫెసో లో జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
నైరుతి బుర్కినాఫెసో లోని బాంబ్లోరా గ్రామం వద్ద ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ పేలుడుకు బంగారాన్ని శుద్ధి చేసే రసాయాలే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. భారీ పెలుడు తరువాత అక్కడ శరీర భాగాలు తునాతునకలై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పరిస్థితి భయానకరంగా మారిందని ఓ అధికారి తెలిపారు.
ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో బుర్కినోఫెసో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి అత్యంత వేగంగా చేస్తున్న దేశం ఇదే. బాంబ్లోరా వంటి చిన్ని చిన్న బంగారు గనులు ఇటీవల కాలంలో చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటువంటి మొత్తం 800 వరకూ ఉన్నాయి. అనధికారిక గనుల ద్వారా సేకరించిన బంగారాన్ని పొరుగున ఉన్న టోగో, బెనిన్, నైజర్, ఘనా వంటి దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు దక్షిణాఫ్రికాకు చెందిన సెక్యూరిటీ స్టడీస్ పేర్కొంది.
ఈ రంగంలో 2019 నాటికి 1.5 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా, 2 బిలియన్ డాలర్లు ఆదాయం లభిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. చిన్న తరహా గనుల్లో నిబంధనలను పాటించకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారాయని మైనింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన బంగారు గని ప్రాంతంలో సహాక చర్యలు కొనసాగుతున్నాయి.