తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా అనుమానస్పద వ్యక్తిని అరెస్ట్ చేస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందికి జున్వే చిక్కాడు. కొద్ది రోజుల కిందటే అతడి వ్యాపార భాగస్వామి సన్ జైంగ్‌ని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే సాధారణ పౌరుడు కాదని అతను నిఘా సంస్థ తరపున మన దేశంలో పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది.
నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా పలు ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. అతడి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్‌లో జున్వే ‘స్టార్ స్ప్రింగ్’ పేరిట హోటల్ నడుపుతూ తమ దేశస్థులు కొందరిని సిబ్బందిగా చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. తన సహచరుడితో కలిసి ఇప్పటివరకూ 13 వందలకు పైగా సిమ్ కార్డులను దొంగచాటుగా మన దేశం నుంచి చైనాకు తరలించినట్లు తెలిసింది.
ఈ సిమ్ కార్డుల సాయంతో బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం సహా ఇతరత్రా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. లఖ్‌నవూలో నమోదైన ఓ కేసులో హాన్ జున్వే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ కేసు కారణంగా భారతీయ వీసా లభించకపోవటంతో బంగ్లాదేశ్ బిజినెస్ వీసాతో దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. హాన్ జున్వే గతంలో నాలుగుసార్లు భారత్‌కు వచ్చి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హన్ జున్వేపై బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన తర్వాత నుంచి సన్ కోసం గాలిస్తున్నారు.
2010లో హైదరాబాద్ వచ్చిన హాన్ జున్వే 2019 తర్వాత దిల్లీ గురుగ్రామ్ ప్రాంతాలకు మూడుసార్లు వచ్చినట్లు అంగీకరించాడు. హాన్ జున్వే గూఢచర్యంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన బీఎస్‌ఎఫ్ అధికారులు.. అతణ్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.